Monday, December 23, 2024

నేడు డ్రా పద్ధతిన మద్యం దుకాణాలు

- Advertisement -
- Advertisement -

కేటాయింపులో విమర్శలకు తావివ్వొద్దు : ఎక్సైజ్‌శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు, గుడుంబా, సొంతలేబిళ్ళ ద్వారా తయారు చేసే నకిలీ మద్యం, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే మద్యం వల్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు వీటన్నిటినీ కట్టడి చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎక్సైజ్ టెండర్ల లక్కీ డ్రాకు సంబంధించిన ఏర్పాట్లపై మహబూబ్ నగర్ లోని తమ క్యాంప్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అత్యంత పారదర్శకమైన నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా మద్యం దుకాణాల కోసం సిండికేట్లు కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం 1,31,490 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. నేడు ఉదయం 11 గంటల నుంచి అన్ని జిల్లా కలెక్టరేట్లలో వీడియో చిత్రీకరణ ద్వారా ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి వెంటనే అలాట్మెంట్ ఆర్డర్లు కూడా అక్కడే అధికారులు అందిస్తారని మంత్రి వివరించారు. లైసెన్స్ దారులు, ఎంట్రీ పాస్ ఉన్న వారికి మాత్రమే లక్కీ డ్రా నిర్వహించే ప్రాంతంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఇక టెండర్ల ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సమైక్య రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయం అక్రమ మద్యం వ్యాపారం చేసే వారి జోబుల్లోకి పోయేదని నకిలీ మద్యాన్ని నిరోధించినందున ప్రస్తుతం ఆ ఆదాయం అంతా నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతోందని మంత్రి తెలిపారు. అక్రమ మద్యాన్ని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారులకు క్రమం తప్పకుండా పదోన్నతులు కూడా ఇస్తామని అన్నారు.
పారదర్శకంగానే…
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో అనుసరించిన పారదర్శకత, సిండికేట్‌లకు ఎటువంటి అవకాశం ఇవ్వకపోవడం వల్ల గత ఎక్సైజ్ సంవత్సరం 2021- – 2023లో ఏ 4 వైన్ షాపుల కోసం దరఖాస్తుల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని ఈ విషయం కమిషనర్, డిపిఈఓలకు కూడా తెలుసని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, పొరుగు రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి రవాణా అవుతున్న భారీ నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు, అలాగే వాటిని జప్తు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, దీని ఫలితంగా మద్యం అమ్మకాలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ సైదులు, సీఐ వీరారెడ్డి ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News