న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండ బాధితులకు సహాయ , పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ , సోమవారం సుప్రీం కోర్టుకు మూడు నివేదికలు సమర్పించింది. బాధితులకు పరిహార చెల్లింపు పథకాన్ని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అల్లర్లలో భాగంగా బాధితులు తమ గుర్తింపు పత్రాలను కోల్పోయారని, వాటిని మళ్లీ జారీ చేయాలని సూచించింది. దీంతోపాటు కమిటీకి సాయంగా నిపుణులను నియమించాలని కోరింది. ఈ అంశాలను పరిగణన లోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం , కమిటీ పనితీరును సులభతరం చేసేందుకు ఆగస్టు 25న ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.
‘కమిటీ సమర్పించిన మూడు నివేదికలు, మణిపూర్ బాధితులకు అవసరమైన దస్త్రాలను జారీ చేయాలని పరిహార పథకాన్ని అప్‌గ్రేడ్ చేయాలని , కమిటీకి సాయంగా డొమైన్ నిపుణులను నియమించాలని సూచిస్తున్నాయి. ’ అని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నివేదికల ప్రతులను సంబంధిత న్యాయవాదులందరికీ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు మణిపూర్ బాధితుల్లో ఒకరి తరఫు వాదిస్తోన్న న్యాయవాది బృందా గోవర్ , ఈ కమిటీతో తగిన సంప్రదింపులు జరిపి సూచనలను క్రోడీకరించింది.
ఇదిలా ఉండగా, మణిపూర్ బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు , ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీని సుప్రీం కోర్టు నియమించిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వం లోని ఈ కమిటీలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలిని పి జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆశా మేనన్ సభ్యులుగా ఉన్నారు. మణిపూర్ హింసాకాండకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రస్తుతం దాదాపు 10 పిటిసన్లను విచారిస్తోంది.