సిన్సినాటి: ప్రతిష్టాత్మకమైన సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా) టైటిల్ సాధించాడు. హోరాహోరీగా సాగిన మారథాన్ ఫైనల్ సమరంలో రెండో జకోవిచ్ 57, 76, 76 తేడాతో టాప్ సీడ్ అల్కరాజ్ గార్ఫియా(స్పెయిన్)ను ఓడించాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు అల్కరాజ్ అటు నొవాక్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరులో హోరాహోరీ తప్పలేదు. అయితే తొలి సెట్‌లో అల్కరాజ్ కాస్త దూకుడుగా ఆడాడు. జకోవిచ్ పోటీని తట్టుకుంటూ ముందుకు సాగాడు. కీలక సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఆడిన టైబ్రేకర్‌లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
రెండో సెట్‌లో మాత్రం అల్కరాజ్‌కు జకోవిచ్ నుంచి అనూహ్య పోటీ ఎదురైంది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. కీలక సమయంలో అల్కరాజ్ ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న జకోవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా హోరాహోరీ తప్పలేదు. కానీ, చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన జకోవిచ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఇక మహిళల విభాగంలో ఏడో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) విజేతగా నిలిచింది. ఫైనల్లో గాఫ్ 63, 64తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన కరోలినా ముచోవాను ఓడించింది.