Monday, December 23, 2024

మోడీ పాలనలో రూపాయి పతనం

- Advertisement -
- Advertisement -

ఒకే విధానాలను అనుసరిస్తూ ఎదుటి వారిని వేలెత్తి చూపితే అవకాశం వచ్చినపుడు అవే వేళ్లు మన వైపు తిరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ స్పృహ ఉండదని గతంలో అనేక ఉదంతాలు వెల్లడించాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నేతలకూ అదే పరిస్థితిని రూపాయి తెచ్చింది. ‘రూపాయి అగాధంలో పడుతుందా దాని కంటే ఎక్కువ లోతులో కాంగ్రెస్ పడుతుందా అన్నపోటీ జరుగుతోం ది. కేంద్ర ప్రభుత్వానికి దేశ భద్రత గురించి గానీ, అదే విధంగా రూపాయి పతనం గురించి గానీ పట్టలేదు. దాని కుర్చీని కాపాడుకోవటం గురించే ఆందోళనపడుతోంది. డాలరుతో మారకంలో రూపా యి పతనం అవుతోంది. కాంగ్రెస్ కారణంగా అది ఐసియులో ఉంది. ‘రూపాయి పతనం గురించి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోడీ ట్వీట్లు, సభలలో చేసిన విమర్శలివి. 201314లో రూపాయి ఒక డాలరుకు రూ. 56 62 మధ్య కదలాడింది. ఇప్పుడు కొత్త రికార్డు నెలకొల్పి రూ. 83 దాటింది. తాము అధికారానికి వస్తే రూపాయి విలువను రూ. 45కు పెంచుతామని నాడు బిజెపి చెప్పింది. ‘గత మూడు నెలలుగా రూపాయి పతనం వేగంగా జరుగుతోంది.

దాన్ని బలపరిచేందుకు కేంద్రం ఏ చర్యలూ చేపట్టలేదు. ఇలా రూపాయి పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి. ఇంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంటుందని దేశం ఎన్న డూ ఊహించలేదు. కానీ అలాంటి సంక్షోభంలో నాయకత్వం దిక్కుతోచకుండా ఉంది. దీంతో ఆశ సన్నగిల్లుతోంది. పౌరుల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఎలాంటి చర్యలనూ కేంద్రం తీసుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మూడునెలలకు ఒకసారి ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని కేంద్రం చెప్పటాన్ని వింటున్నాంగానీ జరిగిందేమీలేదు’ అని బిజెపి ఎన్నికల ప్రచార కమిటీ నేతగా మోడీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2022 జులై 11న పార్లమెంటులో అంగీకరించినదాని ప్రకారం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ రూ. 16.08 (25.39శాతం) పతనమైంది. ఆ రోజు మారకపు విలువ రూ. 79.41 గా ఉంది. ఇప్పుడు 83 దాటింది. డాలరుతో మారకంలో అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నపుడు మనది ఎలా తగ్గకుండా ఉంటుందని పాలక పార్టీ నేతలు వాదనలు చేస్తున్నారు. ఇతర కరెన్సీలతో విలువ తగ్గలేదంటున్నారు. ప్రధాన కరెన్సీలతో 2014 2023లో ఆగస్టు 19 నాటి రూపాయి విలువలు ఎలా ఉన్నదీ చూస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుంది. 2014 ఏడాదిలో సగటు విలువ అని గమనించాలి.

డాలరు విలువ పెరిగింది తప్ప మన రూపాయి విలువ తగ్గలేదు, ఇతర కరెన్సీల కంటే మనది పటిష్టంగా ఉంది, ఇతర కరెన్సీల విలువలు కూడా పడిపోతున్నాయంటూ సమర్ధించుకొనేందుకు, జనాన్ని నమ్మించేందుకు బిజెపి మంత్రులు, నేతలు చూస్తున్నారు. దాని వలన మనకు ఒరిగేదేమిటి? పైన పేర్కొన్న పట్టిక ప్రకారం ఒక్క జపాన్ కరెన్సీ ఎన్‌తో మాత్రమే మన రూపాయి విలువలో మార్పు లేదు. మిగిలిన కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి పతనమైంది. మన కంటే దరిద్రంగా ఉన్న దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే మనది పెరగవచ్చు. ఉదాహరణకు పాక్ రూపాయి. 2014లో దాని విలువ 1.70 కాగా ఇప్పుడు 0.28కి పడిపోయింది. పాకిస్తాన్ నుంచి సరకులు దిగుమతి చేసుకుంటే మనకు కారుచౌక. మన దేశం నుంచి వారు దిగుమతి చేసుకుంటే భారం పెరుగుతుంది. ప్రధాన కరెన్సీలతో కూడా పతనం అన్నది వాస్తవం. డాలరు విలువ పెరిగింది, మనది తగ్గలేదు అని చెబుతున్న వారు ఇప్పుడున్న మారకం రేటుతో డాలర్లను కొంటారా లేక 2014నాటి రేట్లతో కొనుగోలు చేస్తారా? ఒన్ ఇండియా డాట్ కావ్‌ులో 2020 ఆగస్టు 14న ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 2005 జనవరిలో రూ. 43.47గా ఉన్నది. 2014 మే నెలలో రూ. 59.44గా ఉంది. పతనం పదహారు రూపాయలు.

ఇప్పుడు రూ. 83 అనుకుంటే మోడీ ఏలుబడిలో రూ. 24 తగ్గింది. మనది ఎగుమతి చేసే దేశమైతే మన కరెన్సీ పటిష్టంగా ఉంటే మనకు లాభం, దిగుమతులైతే డాలర్లు, ఇతర కరెన్సీల కోసం మనం ఎక్కువ రూపాయలు చెల్లించాలి. రాయితీ రేట్లకు మనం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం. వారికి డాలర్లలో చెల్లించేందుకు వీలు లేదు గనుక మన చమురు శుద్ధి సంస్థలు ఇటీవల చైనా యువాన్లలో చెల్లిస్తున్నాయి. అంటే మనం డాలర్ల బదులు యువాన్లు కొనుగోలు చేస్తున్నాం. మన కంటే ముందే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో యువాన్లు చెల్లిస్తున్నాయి.తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో రూపాయి విలువ పతనంలో కొత్త రికార్డులను తాకింది. ఇంకా పతనం కావచ్చని చెబుతున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గించాలంటే అక్కడ వడ్డీ రేటు పెంచటాన్ని మార్గంగా విధాన నిర్ణేతలు ఎంచుకున్నారు. దాంతో అమెరికా డాలరు రుణాల మీద వచ్చే వడ్డీ ఎక్కువగా ఉండటంతో ప్రపంచంలో ఉన్న డాలర్లన్నీ అక్కడకు చేరుతున్నాయి. దాని విలువ పెరుగుతోంది. మనతో అనేక కరెన్సీల మీద ప్రతికూల ప్రభావం పడుతోంది. మరికొంత కాలం అమెరికా వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.

అంటే మన కరెన్సీ విలువ ఇంకా పతనం కావచ్చు. మన ఎగుమతులు దిగుమతుల కంటే తక్కువగా ఉన్నందున మనకు నష్టం. డాలరుతో చైనా కరెన్సీ విలువ కూడా తగ్గింది. అది చైనాకు వరంగా మారింది. దాని ఎగుమతులు ప్రపంచంలో తక్కువ ధరకు అమ్ముడుపోతాయి. ఎగుమతి సామర్ధ్యం పెరుగుతుంది. మన ఎగుమతులకు పోటీ పెరుగుతుంది.వాణిజ్య లోటు పెరిగితే మన రూపాయి మరింత బలహీనమవుతుంది. మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనం గల అనేక మంది స్విస్ బాంకుల్లో డబ్బు దాచుకుంటారని తెలిసిందే. వాటిని రక్షిత స్వర్గాలు అని పిలుస్తారు. అంటే స్విస్ కరెన్సీ ఫ్రాంక్‌లోకి డబ్బును మార్చుకొని ఆస్తులు కొనుగోలు లేదా బాంకుల్లో డబ్బు దాచుకుంటారు. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన 2014లో ఒక స్విస్ ఫ్రాంక్‌కు మన కరెన్సీ మారకపు విలువ ఏడాది సగటు రూ. 66.68. అది ఇప్పుడు ఆగస్టు 19న రూ. 94.28గా ఉంది. అంటే మన కరెన్సీ పతనమవుతున్న కొద్దీ నగదు వ్యాపారులు డాలర్లు లేదా ఫ్రాంక్‌లో తమ డబ్బును దాచుకునేందుకు ఎగబడతారు. దాంతో వాటి విలువ మరింత పెరుగుతుంది. ఎగబడే దేశాల కరెన్సీ విలువ పతనమవుతుంది. ఇప్పుడు మన రూపాయి ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. పదేండ్ల క్రితం విమర్శలు చేసిన నరేంద్ర మోడీ లేదా ఇతర బిజెపి నేతలు ఇప్పుడు నోటికి తాళం వేసుకొని పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు.

మన కరెన్సీ విలువను పెంచేందుకు అంటే పదేండ్ల క్రితం బిజెపి చెప్పినట్లు రూ. 45కు తగ్గించేందుకు పూనుకుంటే మన ఎగుమతిదార్లు గగ్గోలు పెడతారు, దిగుమతిదార్లు సంతోషిస్తారు. అదే పతనాన్ని అనుమతిస్తే దానికి భిన్నంగా స్పందన ఉంటుంది. 2013 నాటి పతనానికి ఇప్పటి పతనానికి పోలిక సరైంది కాదు అని కొందరు ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలపడిందని కూడా ఉదాహరణలు చూపారు. అలా జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జనానికి కావలసింది రూపాయి బలపడితే లేదా పతనమైతే జనం మీద మన ఖజానా మీద చూపిన అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఏమిటన్నది గీటురాయి. రెండురెళ్లు నాలుగు అన్నట్లుగా మన ఎగుమతులు పెరిగితే మనకు లాభం, దిగుమతులు పెరిగితే నష్టం. అన్ని అనర్ధాలకు కారకులు గత యుపిఎ పాలకులు అని ఊరూవాడా ప్రచారం చేశారు. మేకిన్ ఇండియా, మేక్ ఇండియా పేరుతో పెద్ద ఎత్తున ఎగుమతులు చేసి చైనా స్థానాన్ని ఆక్రమిస్తామన్నారు. కానీ జరిగిందేమిటి? కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2022 23లోని గణాంకాల అనుబంధం పేజీ 108, 109లో ఇచ్చిన సమాచారం ఏమి చెబుతున్నదో ఎవరైనా చూడవచ్చు.

2003 04 (వాజ్‌పాయి సర్కార్ చివరి సంవత్సరం) లో మన దేశ ఎగుమతుల విలువ రూ. 2,93,367 కోట్లు కాగా, యుపిఎ చివరి సంవత్సరం 201314 నాటికి అవి రూ. 19,05,011కోట్లకు చేరాయి. అదే నరేంద్ర మోడీ ఏలుబడిలో 2021 22 నాటికి రూ. 30,47,021కు చేరాయి. ఎవరు ఎంత వృద్ధి సాధించినట్లు? ఏ స్కూలు విద్యార్ధిని అడిగినా కాంగ్రెసే అని వెంటనే చెప్పేస్తారు. కాంగ్రెస్ ఏలుబడిలో దేశం పరువు పోయిందని, విదేశాలు తిరిగి తమ నేతి తిరిగి తెచ్చారని చెప్పుకుంటున్న బిజెపి నేతలు మన ఎగుమతులకు మార్కెట్లను ఎందుకు సంపాదించలేకపోయారో చెప్పగలరా? మాక్రోట్రెండ్స్ నెట్ సమాచారం మేరకు 2004 నుంచి 2013 వరకు పది సంవత్సరాల్లో సగటున మన జిడిపిలో 22.09% విలువగల వస్తు,సేవల ఎగుమతులు జరిగాయి. 2014 నుంచి 2021 వరకు 8 సంవత్సరాల సగటు 19.85 శాతమే ఉంది. నరేంద్ర మోడీ విదేశాల్లో మన ప్రతిష్ఠను పెంచారని, మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా పిలుపులు, ఎగుమతి ప్రోత్సాహకాలు, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తెచ్చారని, సులభతర వాణిజ్య సూచికను ఎంతగానో మెరుగుపరిచారని చెప్పిన కబుర్లు, ప్రచారం ఏమైనట్లు ? ఎగుమతుల శాతం ఎందుకు తగ్గినట్లు ?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News