భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల జనగణనను కాంగ్రెస్ నిర్వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
మంగళవారం బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని సాగర్‌లో ఒక బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిఫార్సు మేరకు మంజూరైన బుందేల్‌ఖండ్ ప్యాకేజ్‌ని రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం అమలుచేయలేదని ఆరోపించారు. హింసాకాండతో తల్లడిల్లిన మణిపూర్ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఖర్గే ఆరోపించారు.
ఈ నెల మొదట్లో రూ. 100 కోట్ల వ్యయంతో షెడ్యూల్డు కులాల ఆరాధనీయుడు సంత్ రవిదాస్ స్మారకం, ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఖర్గే ప్రస్తావిస్తూ సాగర్‌లో సంత్ రవిదాస్ ఆలయానికి శంకుస్థాపన చేసిన మోడీ ఢిల్లీలో సంత్ రవిదాస్ ఆలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. కేవలం ఎన్నికల సమయంలోనే సంత్ రవిదాస్ పేరును ప్రధాని మోడీ గుర్తు చేసుకుంటారని ఆయన విమర్శించారు.