Friday, November 22, 2024

అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

- Advertisement -
- Advertisement -

త్వరితగతిన టికెట్‌లు కేటాయించాలని పిసిసి ప్లాన్
వేరే పార్టీల నుంచి వచ్చే వారికి సముచిత స్థానం కల్పించాలని పిసిసి యోచన
ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 10 మంది ఆశావహుల దరఖాస్తు
తలనొప్పిగా మారిన దరఖాస్తుల వడబోత

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ సైతం అభ్యర్థుల ఎంపికపై స్పీడు పెంచింది. రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్ పార్టీని వీడి వచ్చే నాయకులను తమ పార్టీలో చేర్చుకొని వారికి టికెట్‌లను కేటాయించాలని భావిస్తోంది. బిఆర్‌ఎస్ దాదాపు సిట్టింగ్‌లను అభ్యర్థులుగా ప్రకటించడంతో ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే అశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ ఈనెల 25వ తేదీ వరకు అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయనుంది. అనంతరం దరఖాస్తులను పరిశీలన చేసి అర్హులను ఎంపిక చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనే గెలుపు గుర్రాల జాబితాను ఎంపిక చేసే బాధ్యతను కేరళకు చెందిన కరుణాకరణ్ నేతృత్వంలో ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ చేపట్టింది. దీంతో ఇప్పటికే పలు నియోజకర్గాల నుంచి 5 నుంచి 10 మంది ఆశావహులు టికెట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడంతో వడబోత పార్టీకి ఇబ్బందిగా మారింది.
దరఖాస్తు చేసుకోకున్నా అవకాశం
అయితే రానున్న రోజుల్లో వేరే పార్టీల నుంచి భారీగా కాంగ్రెస్‌లోకి వలసలు రావచ్చని భావిస్తున్న పిసిసి ఆ దిశగా చర్యలు చేపట్టింది. పార్టీలోకి వచ్చే వారికి సరైన స్థానం కల్పించడంతో పాటు వారికి తగిన గౌరవాన్ని కల్పించాలని కూడా ఢిల్లీ అధిష్టానం నుంచి పిసిసికి ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ప్రస్తుతం వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్లు ఈనెల 25వ తేదీ లోపు కాంగ్రెస్ పార్టీ కోసం దరఖాస్తు చేసుకోకున్నా వారికి టికెట్‌లను కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ అనేక వ్యూహాలను అమలు చేస్తుండగా అధిష్టానం ఇచ్చే సలహాలు, సూచనలను సైతం కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నది పిసిసి ప్లాన్‌లో భాగమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కరుణాకరణ్ కమిటీతో చర్చించి
కరుణాకరణ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీతో చర్చించి మెరుగైన అభ్యర్థులతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది. అందులో ఏమైనా సమస్యలున్నప్పుడు సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళతారు. అధిష్టానం నిర్ణయం మేరకు అభ్యర్థులను ప్రకటించాలని పిసిసి నిర్ణయించింది. ఆ ప్రక్రియకు రెండు నుంచి మూడువారాలు పడుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కసరత్తును మరింత వేగవంతం చేసి వచ్చే నెల మొదటి వారంలో తొలి జాబితానైనా ప్రకటన చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. బిఆర్‌ఎస్ ఏడుగురిని మినహా సిట్టింగ్‌లనే అభ్యర్థులుగా ప్రకటించడంతో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. నియోజకవర్గాల జరిగిన అభివృద్ధిని క్రోడీకరించి ఆయా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్లడానికి అవసరమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని అధిష్టానం ఆదేశించడంతో ఆ దిశగా పిసిసి అడుగులు వేస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News