హైదరాబాద్ : స్వరాష్ట్రంలో గిరిబిడ్డల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేశారని రాష్ట్ర గిరిజన, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. బుధవారం హైదరాబాద్, మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో నూతనంగా నియమితులైన ఐటిడిఎ, పిఓలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఎ పిఓలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల సామాజిక ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా దేశంలో సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గిరిజనుల హక్కులు కాపాడడంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాత్ర కీలకమైందని అన్నారు. అధికారులు నిత్యం గిరిజనులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
గిరిజనులకు సేవ చేస్తే కృతజ్ఞతగతగా గిరిజనులు అధికారులను అక్కును చేర్చుకుంటారని, గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలపై, హక్కులపై అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో వివిధ దశల్లో ఆగిపోయిన పెండింగ్ పనులను టెండర్లు, అగ్రిమెంట్ లు పూర్తి చేసుకుని పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం,జీవనోపాధి, ఆర్థిక అభివృద్ధి తోడ్పాటుతో గిరిజనుల జీవన ప్రమాణాలు మరింత పెంపొందించేలా కృషి చేయాలన్నారు. గిరిజన ఆవాసాల్లో మిషన్ భగీరథ, విద్యుత్ సమస్యలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అభివృద్ధి పనుల పై కిందిస్థాయి అధికారులతో చర్చించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి 188 గిరిజన గురుకులాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాల ద్వారా మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. సిఆర్‌టియులకు 12 నెలల జీతాలను అందిస్తున్నామని తెలిపారు.
బడి వయస్సు పిల్లలు బడికి దూరంగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోడు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు వారి ఖాతాల్లో జమ అవుతుందా లేదా ఏమైన ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు . రాష్ట్రంలోని అడవిబిడ్డల దశాబ్ధాల కల నెరవెర్చి, గత నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ పోడు సమస్యను పరిష్కరించి పట్టాలు అందించడం జరిగిందన్నారు. బిటి రోడ్లకు సుమారు రూ. 1000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఎక్కువ గిరిజన ఆవాసాలకు రోడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 7 యూనివర్సిటిలలో బాల బాలికలకు ప్రత్యేకంగా 140 కోట్లతో వసతి గృహాలను నిర్మించు కొవడం జరుగుతోందన్నారు. ఇప్పటికే గిరిజన గ్రామా పంచాయతీల్లో పంచాయతీ భవనాలకు మంజూరి ఇచ్చి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఒక్కో భావనానికి రూ. 20 లక్షల చొప్పున నిధులను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రతి గిరిజన నియోజక వర్గంలో, జిల్లా కేంద్రాలలో గిరిజన భవనాలను మంజూరు చేసినట్లు తెలిపారు.
ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నిధులు కేటాయిస్తోందన్నారు. అనంతరం గురుకుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ బుక్స్ ను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా జెడ్ చో0గ్త్, స్పెషల్ సెక్రటరీ శ్రీధర్, గురుకులాల సెక్రటరీ నవీన్ నికోలస్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఐటిడిఎ పిఓలు, గిరిజనాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.