Saturday, November 23, 2024

మైనారిటీ గురుకుల విద్యార్థుల కలలు సాకారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకు చెందిన ఐదుగురు విద్యార్థులు తొలి రౌండ్ మెడికల్ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మెడికల్ సీట్లు సాధించి చరిత్ర సృష్టించారు. రెండవ రౌండ్ కౌన్సెలింగ్‌లో మరికొంత మంది విద్యార్థులు ఎంబిబిఎస్ సీట్లు పొందే అవకాశం ఉన్నట్లు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ బి. షఫీఉల్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్‌లో మొహమ్మద్ పర్వేజ్‌కు సీటు లభించింది. తాహెర్ షరీఫ్‌కు ఖమ్మంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీటు వచ్చింది. గౌతమ్ రాజ్‌కి రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్‌లో సీటు లభించింది. జైనబ్ జునేరా మహబూబాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్‌లో సీటు పొందింది. మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలోఎంబిబిఎస్‌లో మొహమ్మద్ షరీఫ్‌కు సీటు లభించింది.

బార్కాస్‌లోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థి మొహమ్మద్ పర్వేజ్ మాట్లాడుతూ ‘మా నాన్న కూరగాయల వ్యాపారి. టెమ్రీస్ ఉచిత లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ అందించకపోతే నా కల సాకారం అయ్యేది కాదు. మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నేను పరీక్షకు సిద్ధమవుతానని అనుకోలేదు. మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి పేద మైనారిటీల సాధికారతకు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు ’ అని అన్నారు. పర్వేజ్ ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరనున్నారు. అదే కళాశాలకు చెందిన విద్యార్థి తాహెర్ షరీఫ్ కార్డియో- సర్జన్ కావాలనే తన ఆకాంక్షను వెలిబుచ్చారు. “మా నాన్న తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. నా ఉపాధ్యాయులు నన్ను చాలా ప్రోత్సహించారు. తెలంగాణ ప్రభుత్వం, మా ఉపాధ్యాయులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు చెప్పడానికి పదాలు సరిపోవు” అని ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరనున్న తాహెర్ షరీఫ్ అన్నారు.

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు, టెమ్రీస్ అధ్యక్షుడు ఎకె ఖాన్, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అభినందించారు. పేద మైనారిటీ విద్యార్థులకు అత్యున్నత నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో గురుకులాలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు టెమ్రిస్ కార్యదర్శి బి. షఫిఉల్లా కృతజ్ఞతలు తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. వెనుకబడిన నేపథ్యం గల విద్యార్థుల కలలను నెరవేర్చినందుకు ఉపాధ్యాయులను అభినందించారు. మెడికల్, ఇంజినీరింగ్ ఔత్సాహికులకు అత్యున్నత స్థాయి నీట్, ఐఐటీ కోచింగ్ సౌకర్యాలు కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ విధానం పెద్ద సంఖ్యలో నీట్, ఐఐటీ ర్యాంకర్లను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News