తిరువనంతపురం: చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఇస్రో మాజీ చైర్మన్ జి మాధవన్ నాయర్ అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన శాస్త్రవేత్తలతో పోలిస్తే భారతీయ శాస్త్రవేత్తల జీతాలు అందులో ఐదోభాగం మాగ్రమేనని అన్నారు.
తక్కువ వేతనాలు పొందుతున్నప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలు తమ పరిశోధనలలో ఏనాడూ రాజీపడలేదని ఆయన స్పష్టం చేశారు. భారతీయ శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలలో తక్కువ ఖర్చుతో పరిష్కారాలను కనుగొనడం వెనుక తక్కువ జీతాలు పొందడం కూడా ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి అభివృద్ధి చెందిన దేశాలలోని శాస్త్రవేత్తల కన్నా అతి తక్కువ జీతాలు రావడం కూడా ఒక ఉపయోగమేనని, ఈ కారణంగానే తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు భారత్‌లో సాగుతున్నాయని ఆయన అన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలలో కోటీశ్వరులు ఎవరూ లేరని, వారు చాలా సామాన్యమైన, నిరాడంబర జీవితాన్ని గడుపుతారని మాధవన్ నాయర్ అన్నారు. వారు డబ్బు గురించి పట్టించుకోరని, తమ లక్ష సాధనకే అంకితమవుతారని ఆయన తెలిపారు. ఈ కారణంగానే ఇస్రో శాస్త్రవేత్తలు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతున్నారని ఆయన అన్నారు. పటిష్టమైన ప్రణాళిక దీర్ఘకాలిక దార్శనికత వల్లనే ఇస్రో శాస్త్రవేత్తలు విజయాలను సాధించగలుగుతున్నారని నాయర్ చెప్పారు. ఒక్కో మెట్టును ఎక్కుతూ శిఖరానికి చేరుకోవడమే ఇస్రో లక్షమని, గతంలో నేర్చుకున్న జ్ఞానాన్ని తదుపరి మిషన్‌కు శాస్త్రవేత్తలు ఉపయోగించుకుంటారని ఆయన చెప్పారు.
పోలార్ ఉపగ్రహ వాహక నౌక కోసందాదాపు 30 ఏళ్ల క్రితం తయారుచేసిన ఇంజన్‌నే జిఎస్‌ఎల్‌వి కోసం ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. ఇతర దేశాల అంరిక్ష ప్రయోగాలతో పోలిస్తే మన దేశంలో 50 నుంచి 60 శాతం తక్కువ ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. చంద్రయాన్ 3 విజయంతో గ్రహాల అన్వేషణలో భారతదేశం కొత్త అడుగుకు నాంది పలికిందని ఆయన చెప్పారు.