Monday, December 23, 2024

హింస రాజకీయాలు చేయం : బిజెపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి కార్యకర్తలు తలుచుకుంటే హింస రాజకీయాలు చేయగలరు.. కానీ మేము అలా చేయం అనిమాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి మరిచారు.. డబుల్ ఇండ్లను ఇవ్వలేదు.. దీనిపై ప్రశ్నిస్తుంటే బిజెపి నేతల తలలు పగులగొడుతున్నారు. పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే హింస రాజకీయాలు చేయగలరు.. కానీ మేము అలా చేయం అన్నారు.

రాష్ట్రంలో హింస రాజకీయం కొనసాగుతోందన్నారు. పోలీసులు ప్రజలకు ఉద్యోగులు.. రాజకీయ పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి..బిఆర్‌ఎస్‌కు కొమ్ము కాయొద్దన్నారు. లేదంటే మిలియన్ మార్చ్ తరహాలో ప్రగతి భవన్ ముట్టడిస్తాం అన్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థుల విషయంలో కెసిఆర్ ది మేకపోతు గాంభీర్యం .. సిట్టింగులకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారుతారని భయంతోనే ఇచ్చారు. లక్ష కోట్ల డబ్బున్న కెసిఆర్ రెండు సీట్ల నుంచి పోటీకి దిగుతున్నారు. బిసిలంటే కెసిఆర్ కు చిన్నచూపు.. ముదిరాజ్, కుర్మలకు కూడా ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.

టిడిపి హయాంలో బిసిలకు ఎలాంటి స్వర్ణయుగం ఉందో.. బిజెపి అధికారంలోకి వస్తే కూడా అలాంటి స్వర్ణ యుగం ఇస్తాం అన్నారు. హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. అసమర్థ బిఆర్‌ఎస్ సర్కారును నిలదీసేలా, వైఫల్యాలను ఎండగట్టేలా బిజెపి కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

ప్రజలతో కలిసి అన్ని జిల్లాల్లో బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేపట్టిన బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దాడిచేసి గాయపర్చడం హేయమైన చర్య అన్నారు. నకిరేకల్, నర్సంపేట, వరంగల్ వెస్ట్‌లో బిజెపి కార్యకర్తలను కర్రలతో బిఆర్‌ఎస్ నాయకులు దాడులు చేశారు. దాడులకు భయపడేది లేదు. బిజెపి పోరాటం ఆగదు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తాం అని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News