బుడాపెస్ట్: భారత జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో అదరగొట్టాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే 88.77 మీటర్లను విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. నీరజ్ తొలి ప్రయత్నంలోనే కటాఫ్ మార్క్ 83 మీటర్లను అధిగమించడంతో ఒలింపిక్ బెర్త్ ఖాయమైంది. క్వాలిఫయింగ్ గ్రూప్‌ఎలో పోటీ పడిన నీరజ్ చోప్రా మొదటి ప్రయత్నంలోనే ఈటెను 88.77 మీటర్ల దూరంలో విసిరాడు.
దీంతో అతనికి ఫైనల్ బెర్త్ దక్కింది. ఇదే గ్రూప్‌లో భారత్‌కు చెందిన డిపి మను ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మను తొలి రౌండ్‌లో 78.10 మీటర్లు విసరగా, రెండో ప్రయత్నంలో 81.31 మీటర్ల దూరాన్ని విసిరాడు.అయితే మను మూడో ప్రయత్నంలో 72.40 మీటర్ల దూరంకే పరిమితమయ్యాడు. అయితే ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన మను ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా, ఇదే గ్రూపులో జర్మనీకి చెందిన జులియన్ వెబర్ రెండో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. గ్రూప్‌బి నుంచి పాకిస్థాన్ స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు అర్షద్ నదీమ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. నదీమ్ 86.79 మీటర్ల దూరాన్ని విసిరి గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక భారత్‌కు చెందిన కిషోర్ జెనా కూడా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా, ఫైనల్లో 12 మంది పోటీ పడనున్నారు.
వీరిలో భారత్‌కు చెందిన ముగ్గురు అథ్లెట్లు ఉండడం విశేషం. ఆదివారం ఫైనల్ పోరు జరుగనుంది. నీరజ్ చోప్రాతో పాటు హెలాండర్, వాద్లెచ్, డేవిడ్ వాగ్నెర్, ఆడ్రియన్ మార్డరె, ఇహాబ్ అబ్దుల్ రహ్మాన్, అర్షద్ నదీమ్, డిపి మను, ఎడిస్ మటుసెవిస్, వెబర్, కిషోర్ జెనా,హెర్మన్ ఫైనల్లో తలపడనున్నారు. కాగా, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్‌కు ఫైనల్లో అర్షద్ నదీమ్, వాద్లెచ్, వెబర్ తదితరులతో గట్టి పోటీ ఎదురుకానుంది.