హైలాకండి(అస్సాం): మహాత్మా గాంధీపై కించపరిచే విధమైన వ్యాఖ్యలు చేసిన ఒక ప్రముఖ బెంగాలీ దినపత్రిక మాజీ సంపాదకుడిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంలోని బరాక్ లోయ నుంచి వెలువడే ఒక ప్రముఖ బెంగాలీ దినపత్రిక మాజీ సంపాదకుడు అతిన్ దాస్‌ను అరెస్టు చేసి జామీనుపై విడుదల చేసినట్లు పోలీసు అధికారి ఒకరు శనివారం తెలిపారు.
మహాత్మా గాంధీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన అతిన్ దాస్‌పై కాంగ్రెస్ నాయకుడు షంసుద్దీన్ బర్లాస్కర్ హైలాకండి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా శుక్రవారం దాస్‌ను గచర్ జిల్లాలోని సిల్చార్‌లోదాస్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అరెస్టు చేశారు.
ఆగస్టు 14న దేశ విభజన నాటి భయాన క్షణాలను గుర్తు చేసుకోవడానికి విభజన్ విభీషిక దివస్‌ను పాటిస్తారు. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు అతిన్ దాస్ మహాత్మా గాంధీపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ చేసిన త్యాగమేమిటని ఆయన ప్రశ్నించడమేగాక దేశ జనాభాలో ఒక వర్గం పట్ల జుజ్జగింపు వైఖరిని ప్రదర్శించారని కూడా ఆరోపించారు.