Monday, November 25, 2024

కొరియర్‌లో గంజాయి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  కొరియర్‌లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను బాలానగర్ ఎస్‌ఓటి, చందానగర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 90 కిలోల డ్రై గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఎడిసిపి నర్సింహారెడ్డి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

సంఘారెడ్డి జిల్లా, రాయికొండ గ్రామానికి చెందిన నాదారి లింగం, సున్పపు రాజు, మహారాష్ట్రకు చెందిన సునీల్, ఓడిసాకు చెందిన చంద్రశేఖర్, డిటిడిసి కొరియర్ ఉద్యోగి కలిసి గంజాయిని రవాణా చేస్తున్నారు. రాజు, లింగంపై గతంలో గంజాయి రవాణా కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇద్దరు మళ్లీ గంజాయి రవాణా చేస్తున్నారు. ఒడిసా నుంచి తెప్పించుకుని మహారాష్ట్రకు చెందిన సునీల్‌కు విక్రయిస్తున్నారు. రాజు, లింగం కలిసి ఒడిసాకు చెందిన చంద్రశేఖర్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నారు.

చంద్రశేఖర్ వీరికి గంజాయిని డిటిడిసి కొరియర్‌లో పంపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరు బాక్సుల్లో గంజాయిని కొరియర్‌లో చందానగర్ బ్రాంచికి పంపించాడు. వీరికి కొరియర్‌లో పనిచేస్తున్న ఉద్యోగి సహకరిస్తున్నాడు. గంజాయిని తీసుకున్న తర్వాత ఇద్దరు నిందితులు మహారాష్ట్ర, తెలంగాణలో అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసిపట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News