Friday, November 22, 2024

ఓయూలో వాణిజ్య, అకౌంటింగ్ విభాగాల అభివృద్దికి ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న అవసరాలు, ప్రమాణాలకు అనుగుణంగా వాణిజ్య, అకౌంటింగ్ విభాగాల్లో పాఠ్య ప్రణాళికలు, కోర్సులను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూ పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దెండబోయిన రవిందర్ యాదవ్ మాట్లాడుతూ ఒప్పందం ద్వారా అత్యుత్తమ ఫలితాల సాధించే దిశగా పనిచేయాలని ఇరు పక్షాలకు సూచించారు. యూజీ, పీజీ ల్లో వాణిజ్య విద్దను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు మేలు చేసే ఉద్దేశంతో న్యూ ఢిల్లీకి చెందిన సంస్థ ఐసిఏఐ ఓయూతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావటం పట్ల రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి కార్యాచరణకు ఓయూ వాణిజ్య విభాగానికి సహకరించాలని అధికారులను కోరారు.

సిఏ విశాల్ దోషి వాణిజ్య శాఖతో అవగాహన ఒప్పందం ఆవశ్యకతను, ఎంఓయూ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. హైదరాబాద్ నగరంలోనే 12వేల మంది చార్టర్డ్ అకౌంటెంట్లు పనిచేస్తున్నారని వీరిలో 90 శాతం మంది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. రెండు అత్యుత్తమ, సుదీర్ఘమైన అనుభవం కలిగిన చారిత్రాత్మకమైన సంస్థలు కలిసి పనిచేయటం ద్వారా విద్యార్థులపై భారీ సానుకూల ప్రభావాన్ని చూపుతుందని సీఏ దయానివాస్ శర్మ అభిప్రాయపడ్డారు. వాణిజ్య విభాగాల్లోని అధ్యాపకుల నైపుణ్యాలు మెరుగుపరుకోవటానికి, పరిశ్రమల నుంచి అనుభవం కలిగిన నిపుణులను బోధనలో భాగస్వామ్యం చేయటం ద్వారా అకడమిక్, పరిశ్రమల మధ్య ఉన్న నైపుణ్యాల కొరత తీర్చేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ద్వారా వాస్తవిక నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు వ్యాపారాల్లో, నిపుణులతో ఇంటర్న్ షిప్ లు ఏర్పాటు చేయటం, చార్టర్డ్ అకౌంటింగ్ కోర్సుల కోసం సమీకృత కోర్సులను రూపొందించటం, వాణిజ్య విభాగాల్లో కెరీర్ కోసం విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఓయూ వాణిజ్య విభాగం, ఐసిఏఐ ఉమ్మడిగా కలిసి పనిచేయనున్నాయి.ఈ కార్యక్రమంలో ఓయూ కామర్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్లు డి. చెన్నప్ప, వి. అప్పారావు, ఎం. గంగాధర్, ప్రొఫెసర్ ప్యాట్రిక్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News