Sunday, December 22, 2024

గణేశ్ చతుర్థికి జియో ఎయిర్ ఫైబర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రిలయన్స్ జియో తన 5జి హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ‘జియో ఎయిర్ ఫైబర్’ను గణేష్ చతుర్ధి (సెప్టెంబర్ 19) నాడు ప్రారంభించనున్నామని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేరొన్నారు. ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పట్ల ఎంతో ఆసక్తితో ఉన్నామని, అనేక ఎఐ ప్రణాళికలు ఉన్నాయని, ఇది జియో వృద్ధికి అత్యంత ఉత్తేజకరమైన టూల్ అని అభివర్ణించారు. సోమవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ ఎజిఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో ముకేశ్ కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ తన జియో ఎయిర్ ఫైబర్‌ని దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 19న ప్రారంభించనుంది. ఎయిర్ ఫైబర్‌తో వైర్ లేకుండా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి వస్తుంది. ఇంకా రిలయన్స్ బీమా వ్యాపారంపైనా సమావేశంలో ముకేశ్ అంబానీ ప్రకటన చేశారు. జియో గత సంవత్సరం రూ.1,19,791 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, జియోకు 45 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారని తెలిపారు. మరోవైపు రిలయన్స్ బోర్డులో ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీలు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. అలాగే ముకేశ్ అంబానీ రాబోయే 5 సంవత్సరాల పాటు ఆర్‌ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. నీతా అంబానీ బోర్డుకు రాజీనామా చేశారు.

ఎజిఎంలో 5 కీలక ప్రకటనలు
రిలయన్స్ ‘జియో ఎయిర్ ఫైబర్’ను సెప్టెంబర్ 19 గణేష్ చతుర్థి నాడు ప్రారంభించనుంది. దీనిలో ఆప్టికల్ ఫైబర్ అవసరం ఉండదు. ఇది 5జి వైఫై సేవ, ఇది 1 జిబిపిఎల్ వరకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవను అందిస్తుంది. జియో తన ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌ను ఇతర కంపెనీల కంటే తక్కువ ధరకు ప్రారంభించవచ్చు. ఇది ఒక రోజులో 1,50,000 కనెక్షన్లను అందించగలదు. ఫిజికల్ ఫైబర్ ద్వారా రోజుకు 15,000 కనెక్షన్లను మాత్రమే అందిస్తుంది. అంటే ఎయిర్ ఫైబర్ పది రెట్లు వేగవంతమైనది.

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(జెఎఫ్‌ఎస్) బీమా రంగంలోకి ప్రవేశిస్తుందని ముకేశ్ అంబానీ ప్రకటించారు. కంపెనీ జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా ఉత్పత్తులను ప్రారంభించనుంది. అదే సమయంలో కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘బ్లాక్‌రాక్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

రిలయన్స్ రిటైల్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే టాప్ 10 రిటైలర్‌లలో ఒకటిగా నిలిచింది. రిలయన్స్ రిటైల్ సంస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారమని ముకేశ్ అన్నారు. రిలయన్స్ రిటైల్ గత ఏడాది 2,60,364 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీని నికర లాభం 9181 కోట్లుగా ఉంది. రిలయన్స్ రిటైల్ మొత్తం స్టోర్ల సంఖ్య 18,040కి చేరుకుంది.

జియో ప్లాట్‌ఫామ్‌లు అన్ని డొమైన్‌లలో భారతదేశ- నిర్దిష్ట ఎఐ మోడల్, ఎఐ- ఆధారిత పరిష్కారాల అభివృద్ధికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్లు ముకేశ్ తెలిపారు. దీంతో భారతీయులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి ఎఐ ప్రయోజనం చేకూరనుంది. ఎఐ ఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయాలు భారతదేశానికి అవసరమని అంబానీ అన్నారు.

2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని, అలాగే 2030 నాటికి 100 జిడబ్లు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని రిలయన్స్ లక్ష్యంగా చేసుకుంది. బ్యాటరీ కెమికల్స్, సెల్స్, ప్యాక్‌లను గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తారు. అదే సమయంవలో బ్యాటరీ రీసైక్లింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 100 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యం కూడా ఉంది.

బోర్డులోకి ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలు
ముకేశ్ అంబానీ తన 200 బిలియన్ డాలర్ల (రూ.16.52 లక్షల కోట్లు) విలువచేసే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)లోకి ఎట్టకేలకు తన వారసత్వాన్ని ప్రవేశపెట్టారు. వాటాదారుల ఆమోదం తర్వాత ఆర్‌ఐఎల్ డైరెక్టర్ల బోర్డు వారిని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించారు. దీంతో పాటు నీతా అంబానీ రాజీనామాను కూడా బోర్డు ఆమోదించింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ కొనసాగుతారని కంపెనీ తెలిపింది. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ ఆర్‌ఐఎల్ బోర్డు సమావేశాలకు హాజరుకానున్నారు. రిలయన్స్ ఫౌండేషన్‌కు ఎక్కువ సమయం కేటాయించేందుకు నీతా కంపెనీ బోర్డుకు రాజీనామా చేశారు. వచ్చే ఐదేళ్లపాటు రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముకేశ్ అంబానీ కొనసాగుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News