ఇముంబై:చైనా దురాక్రమణకు సంబంధించి కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ లడఖ్‌లో చెప్పిందే నిజమైందని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని, అక్సయ్ చిన్ ప్రాంతాన్ని తన భూభాగంగా చూపిస్తూ చైనా సోమవారం విడుదల చేసిన ప్రామాణిక దేశ పటం తాజా సంచికపై సంజయ్ రౌత్ మంగళవారం నాడిక్కడ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ జరపాలని సవాలు చేశారు. లడఖ్‌లోని పాంగాంగ్ లోయలోకి చైనా చొరబడినట్లు రాహుల్ గాంధీ ఇటీవల లడఖ్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయని రౌత్ చెప్పారు.
మన ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే బ్రిక్స్ సదస్సుకు హాజరై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అభివాదం కూడా చేశారని, ఇప్పుడు లడఖ్‌లోని పాంగాంగ్ లోయలోకి చైనా చొరబడినట్లు రాహుల్ గాంధీ చేసిన వాదన వాస్తవరూపం దాల్చిందని ఆయన అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు చైనా ప్రయత్నిస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆయన సవాలు విసిరారు.
ఈ నెల ప్రారంభంలో లడఖ్‌ను సందర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌కు చెందిన అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించుకోలేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని రాహుల్ ఆరోపించారు. చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఎ) దళాలు భారత సరిహద్దుల్లోకి చొరబడిన మాట వాస్తవమేనని స్థానికులు కూడా చెబుతున్నారని రాహుల్ వాదించారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని ఆయన అన్నారు.
చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారని, తమ పంట పొలాలను చైనా సేనలు లాక్కున్నాయని వారు చెబుతున్నారని రాహుల్ తెలిపారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అంగుళం భూమిని కూడా భారత్ కోల్పోలేదని వాదిస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోవాలంటే స్థానికులను అడగాలని రాహుల్ చెప్పారు.