Monday, December 23, 2024

ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్

- Advertisement -
- Advertisement -

‘The history is important because science is a discipline deeply immersed in history. In other words, every time you perform an experiment in science or in medicine, what you’re actually doing is you’re answering someone, answering a question raised by someone in the past’ Siddhartha Mukherjee
‘Public memory is a very strong emotion and in this case, it’s the collective memory of 1.4 billion people. The memory is made up of re-energised hope, an acute sense of nationalism, ideals of patriotism and a strong pride with respect to ISRO as an institution’ Martand Jha

చంద్రయాన్- 3 ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ కావడంతో భారతదేశం అంతర్జాతీయంగా అంతరిక్ష పరిశోధనలో తనదైన చరిత్రను లిఖించింది. చంద్రునిపై కాలిడిన నాల్గో దేశంగానే కాకుండా చంద్రుని దక్షిణ ధ్రువంపై ‘సాఫ్ట్ ల్యాండింగ్’ను సాధించిన ఏకైక దేశంగా మన దేశం రికార్డులకెక్కింది. చంద్రుని ఉపరితలంపై తిరిగేందుకు ఉద్దేశించిన రోవర్ ఎట్లా బయటకు వచ్చిందో ఇస్రో విడుదల చేసిన వీడియో ఎక్స్‌లో ప్రపంచమంతా వీక్షించారు. గత నెల జూలై 14న శ్రీహరికోట వద్ద ప్రయోగించిన చంద్రయాన్- 3 భూమి నుండి 3,84,400 కి.మీ. ప్రయాణించి చంద్రునిపై కాలూనడంతో మన మూన్ మిషన్ మూడు ప్రధాన లక్ష్యాలు 1.ల్యాండర్ (విక్రమ్) మృదువైన ల్యాండిం గ్, 2. రోవర్ (ప్రజ్ఞాన్) డ్రైవింగ్ సామర్థ్యాలను ప్రదర్శించడం, 3. చంద్రమండలపు ఆకృతిని లోతుగా అర్థం చేసుకుంటూ చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేయడం వంటివన్నీ నెరవేరాయి. అందుకే ‘ఇండియా ఆన్ ద మూన్’ అంటూ ఇస్రో అధ్యక్షులు శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్ చేసిన ప్రకటనకు భారతీయుల ప్రతిస్పందన దశదిశలా మార్మోగింది.

భారతీయ వైజ్ఞానిక ప్రగతిని శాస్త్రసాంకేతిక రంగంలో తామే రారాజులం అనుకునే మొనగాని దేశాలకు కళ్లకు కట్టింది. ఇంతకూ చంద్రయాన్-3 వల్ల ప్రయోజన మేమిటనే సామాన్య ప్రజల ప్రశ్నకు సమాధానం ఇది స్పేస్‌క్రాఫ్ట్‌లోని ప్లేలోడ్స్ నిరంతరం ప్రయోగాలను నిర్వహిస్తుంటాయి. తద్వారా అంతరిక్షంలో సంభవించే విషయాలన్నీ ఎప్పటికప్పుడు భూమికి చేరుతుంటాయి. ఈ సమాచారం అంతరిక్ష అధ్యయనానికి మున్ముందు దేశానికి ఎంతగానో ఉపయోగపడగలదు. అంతేకాదు ఇప్పటి వరకు చందమామను గురించి మనకు అందుబాటులో ఉన్న ఊహాత్మక సమాచారం అంతా పటాపంచలై చంద్ర మండలం మీది వాస్తవాలేమిటో తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. సిద్ధార్థా ముఖర్జీ అంటున్నట్టు ఒక్క చందమామే కాదు, అంతరిక్షానికి సంబంధించిన అనేకానేక ప్రశ్నలకు ఈ వ్యోమ నౌక సమాధానాలు పంపించగలదు.

వరుస ప్రయోగాల అనంతరం సఫలీకృతమైన చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ మనకు ఖగోళ పరిశోధనలో గల సుదీర్ఘ అనుబంధానికి ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో నాగరికతలు ఆవిర్భవించడానికి పూర్వమే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చంద్రుని గురించి అధ్యయనం ప్రారంభించారు. ఇందుకు కర్నాటకలోని బ్రహ్మగిరి, జార్ఖండ్‌లోని పోకారియా, గోవాలోని అరోసిమ్ లాంటి ప్రాంతాలలో అమర్చబడిన ఎన్నో టన్నుల బరువున్న భారీ రాతి స్తంభాలు (మెగాలిత్)లే రుజువులు. చంద్రుడికి సంబంధించిన అన్వేషణలో ఈపూర్వ చారిత్రక ఆధారాలిప్పుడు శాస్త్రవేత్తలకు దిక్సూచిగా మారుతున్నాయి. ‘సూర్యచంద్రుల కదలికలను రికార్డ్ చేయడానికి మెగాలిత్‌లు అబ్జర్వేటరీలుగా ఉన్నాయని, వీటిలో శాస్త్రీయ ఖచ్చితత్వం ఉందని, ఈ శిలల పొందిక ద్వారా చంద్ర చక్రాన్ని మన వాళ్లు అద్భుతంగా అంచనా వేసేవారు’ అంటారు ప్రముఖ బయోకెమిస్ట్ ప్రణయ్ లాల్. ఈయన తన ‘Indica : A Deep Natural History of the Indian Sub-continent’ గ్రంథంలో మన దేశంలో సైన్సు పురోగతిని వివరిస్తూ మరెన్నో సంగతులను విశదపరుస్తారు. అయితే ఎంతో ఉజ్వలమైన ఈ మన ప్రాచీనుల శాస్త్రీయ దృక్పథం, అభ్యాసం, ఆవిష్కరణలు క్రమేణా మసకబారాయి.

శతాబ్దాలుగా ఇతరులు మనం చూపిన ఆధారాలను స్వీకరించి మరింత అభివృద్ధి చేసుకున్నారు. మనం మాత్రం మన వైజ్ఞానిక పురోగతికి వెన్నుపోటు పొడిచుకొని మూఢ నమ్మకాల్లోపడి వెనువెనుకనే ఉండిపోయాం. స్వాతంత్య్రానంతరం పండిట్ నెహ్రూ ఉద్ఘాటించిన ‘సైన్స్ టెంపర్’ చీకటి యుగానికి స్వస్తి పలికింది. విజ్ఞాన శాస్త్రంలో ముందడుగు పడింది. వ్యవస్థీకృత సమస్యలు ఎన్నున్నా సైంటిస్టుల కృషి మూలంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆధిపత్యం చెలాయించే దశకు ఇప్పుడు దేశం చేరుకుంది. కృత్రిమ మేధాశక్తిలో ప్రపంచంలో సింగపూర్, ఫిజి, ఐర్లాండ్, కెనడా తర్వాత ఐదోస్థానం దక్కించుకున్న నేపథ్యంలో దేశం కొత్త రోల్ మోడల్స్‌ను అవలంబించాల్సి ఉంది. ఇదే సమయంలో కాలం చెల్లిన ఛాందసాచారాలను ఆలోచనలను విడనాడాల్సి వుంది. ల్యాండర్ పాదమూనిన చోటుని అతీతశక్తితో పోల్చడం కంటే సెక్యులర్ దృక్కోణంలో మిగతా ప్రపంచాలు మెచ్చుకుంటూ ‘ఇండియన్ పాయింట్’ అనడమే సబబు. భూమితో పాటు మానవులు సందర్శించిన ఏకైక ప్రపంచం చంద్రుడు.మనిషి మేధస్సుకు తార్కాణంగా నిలిచిన మూన్ మిషన్లు భూమి -చంద్రుడి మూలకథలను ఒకదానితో ఒకటి కలుపుతూ విశ్వజనులకు వీనుల విందు చేయగలవు.

మహాకవి శ్రీశ్రీ ‘మెదడన్నది మనకున్నది/అది సరిగా పనిచేస్తే/విశ్వరహఃపేటికా/విపాటన జరగక తప్పదు’ అన్నది సైన్సు ఆవిష్కరణలను ఉద్దేశించే. మతం పెద్దలనూ, సైన్సు బాలలనూ ఆకర్షిస్తాయి. అందుకే ప్రభుత్వాలు మూన్ మిషన్ కార్యక్రమాన్ని పిల్లలకు చూపించమన్నాయి. పాఠశాలలు అనేక చోట్ల చూపించారు కూడా. దక్షిణ ఢిల్లీ- కల్కాజీ డివిజన్ గ్రేటర్ కైలాష్‌లోని కౌటిల్య ప్రభుత్వ సర్వోదయ బాల విద్యాలయం- స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో కలసి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి పాఠశాల ఆడిటోరియంలో ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. వ్యోమనౌక చంద్రుడిని తాకగానే కరతాళధ్వనులు చీర్స్‌తో హాలంతా మారుమోగింది. తొమ్మిదో తరగతి విద్యార్థిని దివ్య మాట్లాడుతూ 14న చంద్రయాన్-3 లిఫ్ట్‌ఆఫ్‌ని చూశాను. ఈ రోజు ల్యాండ్ అవడం చూశాను. నరాలు తెగిపోయే ఉత్కంఠను అనుభవించాను. మహదానందంగా ఉన్నాను’ అని స్పందించింది.

మరో విద్యార్థిని శ్రేయా సిన్హా మాట్లాడుతూ మనం చంద్రయాన్ -2 సమయంలో విఫలమయ్యాము, అది నిరాశపరిచింది, కానీ మనం ప్రయత్నాలను విరమించలేదు, కొనసాగించాం, విజయం సాధించాం. ఇదో ఘన విజయం’ అని వర్ణించింది. పిల్లల హావభావాలను గమనించిన అమాత్యురాలు అతిషి ‘ఈ విజయం మన దేశ భవిష్యత్తు కోసం మహదావిష్కరణలను ఊహించే ఆకాంక్షను పిల్లలలో బలంగా రేకెత్తిస్తున్నది. విద్య మీద పరిశోధన కోసం వెచ్చించే పెట్టుబడులు ఎల్లప్పుడూ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తాయని, విద్యార్థులందరూ తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఇస్రో లేదా నాసాలో పని చేయాలని ఆశిస్తున్నారు. ఆకాశం వైపు చూస్తే వాళ్లకు కలిగే కుతూహలమే ఇందుకు కారణం’ అంటూ పిల్లలందరూ స్ఫూర్తి పొందే ఘట్టాన్ని తనూ అనుభూతి చెందింది.

చంద్రయాన్-3 సక్సెస్‌లో వైజ్ఞానిక సందేశంతో పాటు ఇప్పుడు దేశానికో సామాజిక సందేశం, నైతిక సందేశం నిక్షిప్తమై ఉంది. అదేంటంటే చంద్రయాన్- 3 రూపకర్తలందరూ ఐఐటియన్లుకాదు. సాధారణ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివిన వాళ్లే. ఇస్రో చైర్మన్ సోమనాథ్ కేరళలోని కొల్లాం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అట్లాగే రాయణన్, మోహన కుమార్, అతుల, సతీష్, మోహన్, షోరా వీళ్లంతా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ తిరువనంతపురం నుండి ఆయా విభాగాల్లో పట్టభద్రులు. మనకు తెలుసు భారతీయులందరికీ ఐఐటిల పట్ల మక్కువ అంతాఇంతా కాదని. కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రజాధనాన్ని ఐఐటిలకే వెచ్చిస్తోంది. ఎన్‌ఐఆర్ ఎఫ్ పట్టికలో ప్రమాణాలకు నిలువుటద్దంగా టాప్‌లో నిలుస్తూ వస్తున్న ఐఐటిల్లో చదివిన ఇంజినీర్లు ప్రతిభాశాలురే కావచ్చు, కానీ అత్యధిక ఐఐటియన్లు కార్పొరేట్ కంపెనీలకే డబ్బు సంపాదించి పెడుతున్నారు. వాళ్ల అంకితభావం మేధస్సుతో దేశానికి పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదని విచారిస్తూ ఇంజినీరింగ్ విద్యార్థుల స్వార్థపూరిత కెరీరిజాన్ని ధన వ్యామోహాన్ని నిరసిస్తూ ‘IITians went to Silicon Valley; CETians took us to moon’ అంటున్నారు మాజీ కేంద్ర మంత్రి, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యులు శశిథరూర్.

తల్లిదండ్రులుకావచ్చు, విద్యాసంస్థలు కావొచ్చు ఇప్పుడైనా ఎప్పుడైనా పిల్లలకు నేర్పించాల్సింది, మనసుల్లో జొప్పించాల్సింది’ Nation first, Self last’ అనే మంత్రమే. చంద్రయాన్-3 సక్సెస్ నుండి ముఖ్యంగా మనం చేయవలసిందేమంటే, అంతరిక్ష పరిశోధనలో మన అన్వేషణలు మరింత విస్తృతంగా ముందుకు సాగాలి. ఇంతకు ముందు అనుకున్నట్టు క్రిందటి యుగాలకు సంబంధించి రికార్డు కాని చరిత్రను తిరిగి పొందడం కంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం పునాదిపై దేశ భవిష్యత్తును ప్రపంచ భవిష్యత్తుతో అనుసంధానించమనేదే అత్యంత విలువైన లక్ష్యం. ఈ కార్యం సైన్సు అధ్యాపకులు పరిశోధక విద్యార్థుల వల్లనే నెరవేరగలదు. ఇస్రో సాధించిన ఘనతతో ఇండియా ఇప్పుడు కుదుర్లు కుందెనలు కోళ్లగంపలు తిరుగుళ్లూ ఇసుర్రాయి పిడుల దేశం కాదు, జ్ఞానమూ, చైతన్యమూ అను రెండు అస్తిత్వాల ప్రతీపశక్తి అని, శాస్త్రసాంకేతిక రంగాల్లో సాధికారత సాధించిన బలమైన దేశమని అగ్రరాజ్యాలు అభిప్రాయానికి వచ్చాయి. ఇందుకు ఇస్రోకూ చంద్రయాన్ -3 రూపకర్తలందరికీ యావత్భారతావని తరఫున నా వినమ్ర నమస్సులు, సెల్యూట్ .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News