- ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
కన్నాయిగూడెం: మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం కన్నాయిగూడెం మండలం అత్యంత వెనుకబడిన మండలంలో మండల స్థాయి అధికారులందరితో నీతి అయోగ్‌లో భాగంగా మండలంలో నిధుల కేటాయింపు ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రతి గ్రామం ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందరికి అందేలా జిల్లా సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు కృషి చేయాలని అన్నారు.
వివిధ శాఖలకు చెందిన అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా ఆయా శాఖల సిబ్బంది వినూత్నంగా గ్రామ ప్రజలందరి అభివృద్ధికై పనిచేయాలని సూచించారు. అలాగే ప్రణాళికలను బుధవారం సాయంత్రానికి సమర్పించాలని తద్వారా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయవచ్చునని ఆదేశించారు. గ్రామంలోని మహిళల్లో, బాలికలలో రక్తహీనత లేకుండా, యువతీ యువకులందరూ ఏదైనా వృత్తి రంగాలలో శిక్షణ పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఒక మోడల్ అంగన్‌వాడీ సెంటర్ వృత్తి శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటుచేస్తామని తెలిపారు.
అనంతరం స్వీప్ కార్యక్రమంలో భాగంగా ముప్పనపల్లి గ్రామంలోని పిఎస్ 28ను జిల్లా కలెక్టర్ సందర్శించి ఓటరు నమోదు జాబితా గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి ఈపి ప్రేమలత, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, తహసీల్దారు సలీం, ఎంపిడిఓ ఫణిచంద్ర, రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ గణేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ అభినవ్, ఎంఈఓ రాజేష్, ఎస్‌ఐ సురేష్, ఎంపిపి సమ్మక్క, ఎంపిఓ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.