Friday, December 20, 2024

విపక్షాల పిఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ఉండాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ చొరవతో ప్రారంభమైన ప్రతిపక్ష కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థులు పెరిగిపోతున్నారు. పాట్నా, బెంగళూరు తర్వాత ముచ్చటగా మూడో సారి ముంబయిలో సమావేశమవుతున్న ఈ పారీలుతమ అధినేతే ఆ పదవికి తగినవారని ప్రకటనలు చేస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు తమ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాలే ఈ పదవికి తగిన వారని, కూటమికి ఆయనే నేతృత్వం వహించాలన్నారు. వారు ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఢిల్లీ కేబినెట్ మంత్రి ఆతిషి ప్రధాని పదవిపై కేజ్రీవాల్‌కుఎలాంటి ఆసక్తీ లేదని, ప్రధాని రేసులో ఆయన లేరని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన ‘ఇండియా’ కూటమి ముంబయిలో మరోసారి సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్న వేళ ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశం మొత్తానికి ఓ మోడల్‌ను అందించిన అరవింద్ కేజ్రీవాల్ కూటమికి సారథ్యం వహించడంతో పాటు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలని తామంతా కోరుకుంటున్నామని ప్రియాంక కక్కర్ పిటిఐతో మాట్లాడుతూ అన్నారు. కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తుతూ వస్తున్నారని , వారికి మేలు చేసే ఒక మోడల్‌ను అందించారని ఆమె అన్నారు. అందుకే ఆయన ప్రధాని అభ్యర్థి కావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. అయితే దీనిపై నిర్ణయం తన చేతిలో లేదని కూడా ఆమె అన్నారు. ఢిల్లీ ఆప్ కన్వీనర్, రాష్ట్ర మంత్రి గోపాల్ రాయ్ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆప్‌లోని ప్రతి సభ్యుడు కూడా కేజ్రీవాల్ ప్రధాని అభ్యర్థి కావాలని కోరుకుంటున్నారని, అయితే ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కలిసి దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. కాగా ఈ నేతల ప్రకటనలు వెలువడిన కొద్ది గంటలకే కేజ్రీవాల్ విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో లేరని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది.

తమ పార్టీ నేత ప్రియాంక కక్కర్ వెల్లడించిన అభిప్రాయం ఆమె వ్యక్తిగతమని స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీ మంత్రి ఆతిషి స్పందించారు. ‘ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’తో ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఎవరో ప్రధానమంత్రి లేదా మంత్రి కావడం కోసం ఆప్ ఈ కూటమిలో భాగం కాలేదు. దేశ రక్షణ నిమిత్తమే మేము ఇందులో భాగస్వాలమయ్యాం. అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి అభ్యర్థి కారు’ అని ఆతిషి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News