న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా ? అని భారత సర్వోన్నత న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు కేంద్రం గురువారం బదులిచ్చింది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి అవసరమైన నియమావళిని రూపొందిస్తున్నామని, కొంత సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది.
ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కొద్ది రోజులుగా సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం ఇచ్చారు. జమ్ముకశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘం, స్టేట్ పోల్ ప్యానెల్ నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. అలాగే మూడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. మొదటి రెండు దశల్లో పంచాయతీ, మున్సిపల్ పోల్స్ ఉంటాయని, ఆ తర్వాత అసెంబ్లీ స్థాయి ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం పిటిషనర్ల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంది రాష్ట్రహోదా పునరుద్ధరణ ఎంతో కీలకమన్న ధర్మాసనం, దీనికి సంబంధించి కేంద్రం వద్ద ఎటువంటి ప్రణాళిక ఉందని ప్రశ్నించింది. అందుకు మెహతా బదులిస్తూ జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని, లద్దాఖ్‌కు సంబంధించినంత వరకు యూటీ హోదా మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.