Thursday, January 23, 2025

ఉద్యోగులు, సిబ్బంది శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

బిల్డర్లు, ప్రమోటర్లు త్రైమాసిక నివేదికలు,
వార్షిక అకౌంట్స్ ఆడిట్ నివేదికలను కచ్చితంగా సమర్పించాలి
రెరా చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ

మనతెలంగాణ/హైదరాబాద్:  ఉద్యోగులు, సిబ్బంది శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ) చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని రెరా చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం రెరా అధికారులకు, వివిధ విభాగాల సిబ్బందికి ప్రజా ఆరోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ‘రెరా చట్టం అమలు తీరు తెన్నులు, పలు సెక్షన్లపై’ బెంగళూరుకు చెందిన న్యాయవాది ట్రయల్ బేస్ సోహెల్ అహ్మద్, చార్టెడ్ అకౌంటెంట్ వినయ్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమాన్ని చైర్మన్ ప్రారంభించి మాట్లాడారు. సిబ్బందికి ఈ శిక్షణ ద్వారా పనితీరు మరింత మెరుగుపడుతుందని అన్నారు. రెరా చట్టంలోని నిబంధనల మేరకు బిల్డర్లు, ప్రమోటర్లు రేరా రిజిస్ట్రేషన్ పొంది నిర్మాణ పనులు చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి త్రైమాసిక నివేదికలు, వార్షిక అకౌంట్స్ ఆడిట్ నివేదికలు సమర్పించడంలో ఇంకా పూర్తిస్థాయి అవగాహన రావాల్సి ఉందని, ఈ విషయంలో సిస్టం ద్వారానే వారు చేసే ఉల్లంఘనలపై అప్రమత్తం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ తెలిపారు.

రిజిస్ట్రేషన్ అయితే ఎలాంటి మార్పులు, చేర్పులు..
ఈ నివేదికలను సకాలంలో నిర్ధేశించిన మేరకు సమర్పిస్తే రియల్ ఎస్టేట్ కు సంబంధించిన సమస్యలు 90 శాతం సత్వరమే పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. కొనుగోలుదారుల ఆసక్తి, హక్కుల మేరకు బిల్డర్లు, ప్రమోటర్లు సకాలంలో నివేదికలు సమర్పించాలని ఆయన సూచించారు. బెంగుళూరు అడ్వకేట్, ట్రయల్ బేస్ అడ్వకేట్ పార్టనర్ ఈ సోహెల్ అహ్మద్, చార్టెడ్ అకౌంటెంట్ టి. వినయ్‌లు మాట్లాడుతూ బిల్డర్లు, ప్రమోటర్లు ఇచ్చిన హామీల మేరకు విధిగా నిర్మాణాలు, మౌలిక సౌకర్యాలు విధిగా ఉండాలని, వాగ్దానం మేరకు అంతర్గత, బహిర్గత పనులు చేపట్టడంలో విఫలమయితే రెరా చట్ట ప్రకారం శిక్షార్హులని వారు తెలిపారు. నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టడంలో బిల్డర్లు సమర్పించిన అంచనా వ్యయం వివరాలు కీలక పాత్ర వహిస్తాయని వారు పేర్కొన్నారు. రెరా రిజిస్ట్రేషన్ అయిన తరువాత సొంతంగా ఎలాంటి మార్పులు, చేర్పులు చేపట్టరాదన్నారు. మార్పులు, చేర్పులకు కేటాయింపులు పొందిన వారిలో మూడింట రెండొంతుల ఆమోదం తప్పనిసరి అని ఆయన తెలిపారు.

ఆడిట్ నివేదికలు కీలకం
రెరా నిబంధనలు ఉల్లంఘించిన ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయని, వాటిని బ్లాక్ లిస్టులో పెట్టడం రెరా అథారిటీకి కీలక ఆయుధమని ఆయన వివరించారు. బిల్డర్లు, ప్రమోటర్లు తాము చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన త్రైమాసిక నివేదికలు, వార్షిక ఎకౌంట్స్, ఆడిట్ నివేదికలు సకాలంలో సమర్పించడంలో గుజరాత్ 99 శాతం, మహారాష్ట్ర 75 శాతం, తమిళనాడు 70 శాతం, కర్ణాటక 60 శాతంగా ఉన్నట్టు వారు వివరించారు. ఈ నివేదికలు కీలకమని, సకాలంలో వాటిని సమర్పించేలా రెరా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రెరా రిజిస్ట్రేషన్ తోనే సంబంధాలు ప్రారంభమవుతాయని వారు సూచించారు. ఈ సందర్భంగా నష్టపరిహారాల చెల్లింపు విషయంలో కర్ణాటక, తమిళనాడు తదితర హైకోర్టు తీర్పులను శిక్షణ కార్యక్రమంలో వారు ఉదహరించారు. బిల్డర్లు, ప్రమోటర్ల బాధ్యతలతో పాటు కొనుగోలుదారుల హక్కులు, చెల్లించిన డబ్బు తిరిగి వాపసు పొందడం, జరిమానాలు విధించడం, ఫిర్యాదులు వాటి పరిష్కారం, అసోసియేషన్‌ల ఏర్పాటు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ తదితర విషయాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో రెరా సభ్యులు కె.శ్రీనివాసరావు, జె.లక్ష్మీనారాయణ, ఆఫీసర్ సయ్యద్ లతీఫ్  రహమాన్, లీగల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్తయ్య, రెరా పరిపాలన అధికారి గంగాధర్, రవీందర్, శ్రీనివాస్, గోపాల్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News