Monday, December 23, 2024

ఆదిత్యా మిషన్ కు కౌంట్‌డౌన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ప్రతిష్టాత్మక సూర్యమండల ప్రయోగం ఆదిత్యా ఎల్ 1కు కౌంట్‌డౌన్ ఆరంభమైంది. సెప్టెంబర్ రెండవ తేదీ (శనివారం) ఉదయం 11.50 గంటలకు ఆదిత్యా ఎల్ 1 శ్రీహరికోట లాంఛ్‌ప్యాడ్ నుంచి పరీక్షిస్తారు. దీనికి సంబంధించి 23 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు ఆరంభం అయింది. ఆదిత్యా ఎల్ ఒ ల్యాబ్ శాటిలైట్ పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా కక్షలోకి దూసుకువెళ్లుతుంది. సూర్య మండల అధ్యయనంలో ఈ ప్రయోగం అత్యంత కీలకం. భారీ స్థాయి పేలోడ్‌తో ఉండే ఆదిత్యా ఎల్ 1 ద్వారా రోజుకు 1440 ఛాయాచిత్రాలను ఇస్రో కేంద్రానికి అందుతాయని ప్రధాన సైంటిస్టు ఒకరు శుక్రవారం తెలిపారు. ఆదిత్యా ఎల్ 1లో అమర్చి ఉండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్క్) అత్యంత ప్రధానమైనది.

దీని ద్వారానే సూర్యుడి బాహ్యవలయం కరోనాను సమగ్రంగా చిత్రీకరించేందుకు వీలేర్పడుతుంది. నిర్ణీత కక్షలోకి అంటే అటు సూర్యుడు ఇటు భూమి గురుత్వాకర్షణల ప్రభావం లేకుండా ఉండే శూన్య స్థితిలోకి చేరుకున్న తరువాత ఈ వెల్క్ ద్వారా రోజుకు 1440 ఇమేజ్‌లు పంపించేందుకు రంగం సిద్ధం అవుతుంది. వెల్క్‌ను పూర్తి స్థాయిలో సమగ్రరీతిలో పరీక్షించారు. సంబంధిత ప్రక్రియ అంతా కూడా బెంగళూరుకు సమీపంలోని ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఎ) క్రెస్ట్ క్యాంపస్‌లో జరిగింది. వెల్క్ అతి భారీ సాంకేతిక అత్యధిక పాటవపు పేలోడ్‌గా ఉంది. ఇస్రో నుంచి అందిన విశేష సహకారంతో బెంగళూరుకు సమీపంలోని హోస్కోట్‌లోని శాస్త్ర సాంకేతిక విషయాల పరిశోధనా, విద్యా కేంద్రం (క్రెస్ట్)లో దీని పనితీరును నిశితంగా పరిశీలించారు.

ఆదిత్యాలో మొత్తం ఏడు పేలోడ్స్
ఇంతవరకూ ఎవరికి అంతుచిక్కని సూర్యుడి అధ్యయనానికి ఇప్పుడు సాగే ఆదిత్యా ఎల్ 1కు మొత్తం ఏడు పేలోడ్స్‌తో కూడిన సాంకేతిక పరికరాలు ఉంటాయి. భూమిపైకి ప్రసరించే అపార శక్తివంతమైన సూర్య కిరణాలను వీటిలోని నాలుగు పేలోడ్స్ ద్వారా అధ్యయనం చేస్తారు. ఇక మిగిలిన మూడు పేలోడ్స్‌తో సూర్యుడి జీవధార్మిక పదార్థం ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాల గురించి విశ్లేషిస్తారని శాస్త్రజ్ఞులు ఈ కౌంట్‌డౌన్ దశలో తెలిపారు.
భూమికి 1.5 మిలియన్ కిమీల దూరంలో ఆదిత్యా తిష్ట
ఆదిత్యా ఎల్ 1 సూర్యుడి దిశలో భూమికి 1.5 మిలియన్ కిమీల దూరంలో ఉండే లాగ్రాన్‌జియాన్ పాయింట్ 1 చుట్టూ ఉండే వలయాకారపు కక్షలో విడిది చేస్తుంది. ఇది ఆ తరువాత సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇది ఈ పరిభ్రమణాన్ని వలయాకారంలోనే సాగించడం ద్వారా ఎప్పటికప్పుడు సూర్యుడిని అధ్యయనం చేయగల్గుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుంది.

నిమిషానికో ఇమేజ్ సంబంధిత ఛానల్ ద్వారా
ఆదిత్యా ఎల్ 1లో ఇమిడి ఉండే కాంటినమ్ ఛానల్ ఇమేజ్‌లు తీసే ఛానల్‌గా వ్యవహరిస్తుంది. దీని ద్వారా నిమిషానికో ఇమేజ్ అంటే రోజుకు కనీసం 1440 ఛాయాచిత్రాలు భూ కేంద్రానికి అందుతాయి. ఇది అత్యంత కీలకమైన విషయం అని వెల్క్ ఆపరేషన్స్ నిర్వాహకులు డాక్టర్ ముత్తు ప్రియాల్ తెలిపారు. ఆమె ఆదిత్యా ప్రాజెక్టు సైంటిస్టుగా కూడా ఉన్నారు. సూర్యుడి నుంచి ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో కరోనా ద్రవ్యరాశి వెలువడుతుంది. దీనిని ఎప్పటికప్పుడు ఇమేజ్‌లలో పొందుపర్చడం ద్వారా సూర్యుడి అధ్యయనం సులువు అవుతుందని వివరించారు. దీనికి సంబంధించి అత్యంత విశిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను ఐఐఎ రూపొందించింది. సూర్యుడి ధార్మికతలో మార్పులు తలెత్తుతాయా? సూర్యుడి ద్రవ్యరాశి వేగంగా నేరుగా వచ్చి భూమిని తాకే పరిణామం ఉంటుందా?

అనే వలు విషయాలను ఎప్పటికప్పుడు అందే పలు చిత్రాల సాయంతో పరిశీలించుకునేందుకు అవకాశం దక్కుతుంది. ఇంతకంటే శాస్త్రీయ సమాజానికి కావల్సిందేముంటుందని ఈ సైంటిస్టు తెలిపారు. 190 కిలోల వెల్క్ పేలోడ్ ఏకంగా ఐదేళ్ల పాటు చిత్రాలను పంపిస్తూనే ఉంటుంది. ఈ విధంగా సూర్యుడిపై ఆదిత్యా ఎల్ 1 ప్రయోగం పంచవర్ష ప్రణాళికనే అవుతుంది. సాధారణంగా ఈ శాటిలైట్ జీవితకాలం ఐదేళ్లు అనుకుంటున్నారు. అయితే ఇంధన వినిమయ సామర్థం పెంచితే ఈ గడువు మరింత పెరుగుతుంది. ఛాయాచిత్రాల ప్రసరణ ప్రక్రియ గురించి ఐఐఎకు చెందిన కె శశికుమార్ రాజా తెలియచేశారు. అయితే సూర్యుడి ఇమేజ్‌లలో తొలి ఇమేజ్‌లు ఫిబ్రవరి చివరి నుంచి అందుతాయని ఐఐఎ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక శాటిలైట్‌ను సరైన కక్షలోకి ప్రవేశపెట్టడం జనవరి మధ్యకు జరుగుతుంది. అప్పుడు అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయా? లేవా అనేది పరీక్షించుకుంటారు. దీని తరువాత ఫిబ్రవరి చివరి నాటికి తమకు ఇమేజ్‌లు అందుతాయని భావిస్తున్నట్లు సాంకేతిక నిపుణులు ప్రొఫెసర్ జగ్‌దేవ్ సింగ్ తెలిపారు.

నాలుగు నెలల కాలం ..1.5 మిలియన్ కిమీల దూరం
ఆదిత్యా ఎల్ 1 వ్యోమనౌక 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 4 నెలల కాలంలో ఛేదిస్తుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. సూర్యుడి వాతావరణ అధ్యయనం ఈ ఆదిత్యా ఎల్ 1 లక్షం. ఇది అత్యంత విలువైన ప్రాజెక్టు. సంబంధిత ప్రాజెక్టుకు ప్రభుత్వం 2019లోనే దాదాపు 46 మిలియన్ డాలర్ల విలువ మేర నిధిని ఖరారు చేసింది. అయితే దీని వ్యయంపై తాజా అంచనాలను ఇస్రో ఇప్పటికైతే వెలువరించలేదు. సూర్యుడిలోని అంతర్గత పరిణామాలు గురించి ఇప్పటివరకూ నిర్థిష్టరీతిలో ప్రయోగాలు జరగలేదు. సూర్యుడిలోని సౌర తుపానులు, వీటి వల్ల భూమి పర్యావరణంపై పడే ప్రభావం అధ్యయనం చేస్తారు. భూమి సూర్యుడి మధ్య ఉండే లాగ్‌రేంజ్ ప్రాంతపు బిలం వంటి కక్షలో ఆదిత్యా తిష్టవేసుకుని పరీక్షలు నిర్వహిస్తుంది. ఇతరత్రా గురుత్వాకర్షక శక్తి ప్రబావం లేని స్థితికి, రెండు భారీ గ్రహాల పరస్పర గురుత్వాకర్షక శక్తి పరస్పర పోటీ దశలో ఏర్పడే తటస్థ ప్రాంతంలో ఆదిత్యా లాబ్ తిష్టవేసుకుని సూర్యుడిని పరిశీలిస్తుందని సైంటిస్టులు తెలిపారు.

సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో పూజలు
ఇస్రో ఏ కార్యక్రమం చేపట్టినా పూజాదికాలు చేయడం ఆనవాయితీ అయింది. ఇందులో భాగంగా ఆదిత్యా ఎల్ 1 ప్రయోగం దశలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తమ బృందంతో కలిసి ఆదిత్యా నమూనాను తీసుకుని ముందుగా తిరుమల శ్రీవారిని సందర్శించుకుంది. తరువాత సూళ్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరీ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. శనివారం నాటి ప్రయోగానికి విఘ్నాలు తలెత్తకుండా ప్రార్థించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News