మనతెలంగాణ/ హైదరాబాద్ : దశాబ్దంన్నర కాలంగా పర్యావరణ హిత గణనాథులను అందజేస్తున్న సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు అభినందనీయమని పిసిబి సభ్య కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం సనత్‌నగర్‌లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో సభ్య కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్యను సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ కలిశారు. ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమను కృష్ణ ఆదిత్యకు అందజేసి శాలువాతో సన్మానించారు.
సంకల్ప సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలుగా పర్యావరణ హితంగా సంస్థ చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ఈ నెల 18న ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలను సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ప్రసన్నకుమార్, ప్రకృతి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరేపల్లి రాజేంద్రప్రసాద్, ప్రాజెక్టు ఆఫీసర్ నాగేశ్వరరావు, సోమేశ్ కుమార్, సంకల్ప సంస్థ సభ్యులు పాల్గొన్నారు.