వాషింగ్టన్: న్యూఢిల్లీలో వచ్చే వారాంతంలో జరగనున్న జి20 శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కాకపోవచ్చంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఢిల్లీలో జరిగే జి20 విఖరాగ్ర సదస్సుకు జిర్‌పింగ్ హాజరవుతారనే తాను బావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశానికి జిన్‌పింగ్ హాజరవుతారని మీరు అనుకొంటున్నారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు బైడెన్ సమాధానమిస్తూ , ‘ఆయన హాజరవుతారనే నేను అనుకొంటున్నాను’ అని చెప్పారు.
భారత్, చైనాలమధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉండవచ్చని భావించారు. అయితే ఇప్పుడు జిన్‌పింగ్ ఈ సమావేశానికి హాజరు కారని, ఆయన స్థానంలో ప్రధాని లి కియాంగ్ వస్తారని తెలుస్తోంది. మరో వైపు ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరు కావడం లేదనే విషయం తెలిసిందే.
ఇంకా అధికార ధ్రువీకరణ రాలేదు
కాగా వచ్చే వారం చివర్లో జరిగే జి20 నేతల శిఖరాగ్ర సమావేశంంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పాల్గొనడంపై ఇప్పటివకు అధికార ధ్రువీకరణ ఏదీ లేదని జి20 సదస్సు ప్రత్యేక కార్యదర్శి ముక్తేశ్ పరదేశి శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. ‘జీ జిన్‌పింగ్ రాకపై వార్తాపత్రికల్లో కొన్ని వార్తలను చూశాం. అయితే లిఖితపూర్వక ధ్రువీకరణ మేరకే మేం నడుచుకుంటాం. అయితే ఇప్పటివరకు అలాంటిది చూడలేదు. లిఖితపూర్వక ధ్రువీకరణ చూస్తే తప్ప ఆయన వస్తారో లేదో చెప్పలేను’ అని ఆయన చెప్పారు. జి20 లాంటి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి సంబంధించి సాధారణంగా దౌత్యపరమైన నోట్ ద్వరా తెలియజేస్తారని ఆయన చెప్పారు. ఇప్పటికే చాలావరకు అధికార ధ్రువీకరణలు అందాయని, దీనికి సంబంధించి ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు.