మొత్తం 9.5 లక్షల లీటర్లు నిల్వ సామర్థ్యంతో రానున్న 3 భూగర్భ ట్యాంకులు
ముగింపు దశకు చేరుకున్న ఆర్‌పిఎఫ్ ఆఫీస్ భవనం
దక్షిణం వైపు అదనపు ట్రాక్షన్ సబ్ స్టేషన్ కోసం వేగంగా జరుగుతున్న పనులు
మన తెలంగాణ / హైదరాబాద్ : భారతీయ రైల్వేల ద్వారా సొగసైన ఫీచర్లు ఆధునిక రూపాలతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి’ పనులను దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. సుమారు రూ.720 కోట్ల వ్యయంతో చేపట్టిన స్టేషన్ భవనం పునరాభివృద్ధి పనులు శరవేగముగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడానికి పనుల పురోగతిని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా ఎగ్జిట్ గేట్ నం.5 , పార్శిల్ కార్యాలయం సమీపంలో ఇప్పటికే కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయం నిర్మించారు. దీనివలన ప్రయాణీకుల టికెటింగ్, విచారణ కార్యకలాపాలకు మరింతగా వీలు కలిగింది. అదే సమయంలో, స్టేషన్ భవనం ఉత్తరం వైపు మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ సౌకర్యాన్ని నిర్మించడానికి తవ్వకం పని పురోగతిలో ఉంది.
దక్షిణం వైపు, కొత్త స్టేషన్ భవనానికి పునాది పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దక్షిణం వైపున రెండు బేస్మెంట్లు రానున్నాయి. ఒకటి ప్రయాణీకుల రాకను సులభతరం చేయడానికి, మరొకటి ప్రయాణీకుల పార్కింగ్ అవసరాలను తీర్చడానికి ఇది ఉపకరించనుంది. వీటి నిర్మాణానికి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొత్తం స్టేషన్ కోచింగ్ డిపో ఇతర కార్యాలయాల నీటి అవసరాలను తీర్చడానికి మూడు భూగర్భ ట్యాంకులు పునరాభివృద్ధి పనులలో భాగంగా దీనిని నిర్మిస్తున్నారు. 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఒక భూగర్భ ట్యాంక్ రిజర్వేషన్ కార్యాలయం దగ్గర , 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండవ భూగర్భ ట్యాంక్ ట్రైన్ లైటింగ్ డిపో ఏరియా దగ్గర, మరో మూడవ భూగర్భ ట్యాంక్ ప్లాట్‌ఫాం పది సమీపంలో 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ ట్యాంకులన్నింటికీ సంబంధించిన సివిల్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఈ ట్యాంకుల నిర్మాణం పూర్తయితే స్టేషన్‌కు నీటి అవసరాలు తీరుతాయి. ఇంకా కొత్త స్టేషన్ భవనం గణనీయంగా ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండటం వలన ఎక్కువ మంది ప్రయాణీకుల రాకపోకల సేవలను నిర్వహించడంతో పాటు అదనపు సేవలను అందించడం కోసం ప్రస్తుత స్టేషన్ భవనానికి దక్షిణం వైపున అదనపు విద్యుత్ సబ్-స్టేషన్(ఈ.ఎస్.ఎస్)ఏర్పాటు కోసం పని ప్రారంభించారు. ఇప్పుడున్న స్టేషన్ భవనానికి ఉత్తరం వైపున ఒక 11 కెవీ సబ్-స్టేషన్ ఉంది. దీనిని స్టేషన్ అభివృద్ది ప్రణాళికలో భాగంగా 33 కేవీ సబ్-స్టేషన్ గా పునరాభివృద్ధి చేస్తున్నారు. దీనితోపాటు , దక్షిణం వైపున కొత్తగా 33 కె వీ విద్యుత్ సబ్-స్టేషన్ ప్రణాళిక చేయబడింది. ఇప్పటికే ఈ కొత్త ఈ ఎస్ ఎస్ కోసం పునాది పనులు ప్రారంభమై 95 శాతం పూర్తి అయినాయి. ఇంకా కేబుల్ ట్రెంచ్ వర్క్ 80 శాతంగాను, కాలమ్ వర్క్ కూడా 60 శాతం వరకు పూర్తి కావడం గమనార్హం.
రైలు వినియోగదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, నిర్ణీత ప్రణాళిక ప్రకారం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. పని సమయంలో అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని మరియు రైలు వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని బృందాన్ని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆదేశించారు.