Monday, December 23, 2024

హక్కుల ఉద్యమ దిక్సూచి

- Advertisement -
- Advertisement -

దేశంలో పరాగ్ కుమార్ దాస్, జలీల్ ఆంద్రబీల హత్యల తర్వాత దేశంలోనే పౌర హక్కుల సంఘం స్తబ్దతకు గురైన స్థితి లో డా. రామనాధం లాంటి హక్కుల కార్యకర్తల కార్యాచరణ దేశ వ్యాప్తంగా ప్రజలకు ఒక స్ఫూర్తిని ఇస్తూ దిక్సూచిగా పని చేస్తున్నది. డా. రామనాధం అక్టోబర్ 16, 1933న ఖమ్మం జిల్లాలోని మధిరి తాలూకాలో ముసిలికుంట్ల అనే చిన్న గ్రామంలో జన్మించాడు. వీరి కుటుంబంలో ఉన్నత చదువులు అభ్యసించినవాడు, చాలా బాధల కోర్చి డాక్టర్ వృత్తిని పూర్తి చేసినాడు. వరంగల్‌లో ప్రభుత్వ దవాఖానాలో చాలా ఏండ్లు డాక్టర్‌గా పని చేశాడు. ఆ తర్వాత ఖమ్మం, వరంగల్‌లోని హెల్త్ సెంటర్లలో డాక్టరుగా పని చేసాడు. కాని వృత్తి నేపథ్యంలో వస్తున్న అవినీతి, అనైతిక విధానాలను తట్టుకోలేక డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 1968లో వరంగల్‌లోనే పిల్లలు వైద్యశాలలను ప్రారంభించాక క్లినిక్ ఆధారంగా ప్రజల అనేక సామాజిక సమస్యలను పరిష్కరిస్తూ వుండేవాడు. అతని వైద్యశాల అనేక సమస్యలతో వచ్చే ప్రజలకు కేంద్రంగా మారిపోయింది.

1985 సెప్టెంబర్ 3 ఉదయం 53 ఏండ్ల వైద్యుడు, హక్కుల కార్యకర్తల డా. ఎ. రామనాధం సరిగ్గా వరంగల్ పట్టణంలో కాల్చి చంపబడ్డాడు అని హత్య నేపథ్యంలో దేశంలోని పౌర, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు అన్నీ కలిసి దేశంలో సెప్టెంబర్ 3ను పౌర హక్కుల దినంగా పాటిస్తున్నాయి. ఢిల్లీకి చెందిన పౌరహక్కుల సంస్థ పియుడిఆర్ సెప్టెంబర్ 3 ప్రతి సంవత్సరం డా॥ రామనాధం మెమోరియల్ లెక్చర్ నిర్వహిస్తూ వుంటుంది. 2007లో డా॥ రామనాధం మెమోరియల్ మీటింగ్, నార్కొటిక్ పరీక్షలు, ప్రజాస్వామిక హక్కులపై హింస అనే అంశంపై సభను నిర్వహించారు. దీనికి హైదరాబాదులో జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయంలో ఈ అంశాన్ని ఎజెండాగా తీసుకున్నారు. 2008లో జరిగిన డా॥ రామనాధం మెమోరియల్ సదస్సు కార్మిక హక్కులు జ్యూడీషియల్ దాడి అనే అంశంపై నిర్వహించారు. 2009లో జరిగిన డా॥ రామనాధం మెమోరియల్ మీటింగ్ ఎన్‌కౌంటర్ హత్యలు ప్రభుత్వ హత్యలే అనే అంశంపై నిర్వహించారు. దీనికి ప్రధానంగా కశ్మీర్, మణిపూర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌డ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ హత్యలను ప్రధాన భూమికగా చేసుకొని నిర్వహించడం జరిగింది.

2014 లో డా॥ రామనాధం మెమోరియల్ మీటింగ్ ఉరిశిక్షలకు వ్యతిరేకంగా నిర్వహించారు. 2018లో పెట్టుబడి కార్మికులు అనే అంశంపై మెమోరియల్ మీటింగ్ జరిగింది. ముఖ్యంగా రామనాధం మెమోరియల్ మీటింగు అంశాలన్నీ ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనలే ప్రధానంగా వచ్చాయి. 1985లో రామనాధం హత్య, ప్రభుత్వ అప్రజాస్వామిక, నిర్బంధ పాలకులకు పరాకాష్టగా గుర్తింపయితే, ఆనాటి నుండి ఈనాటి వరకు పౌరప్రజాస్వామిక హక్కుల కార్యకర్తల దేశవ్యాప్తంగా నిర్బంధం విచ్చలవిడిగా కొనసాగుతున్నది. 1985 ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు నిర్బంధ కాలం అది, 1985 సెప్టెంబర్ 2వ సాయంత్రం ఖాజీపేట రైల్వేస్టేషన్‌లో యాదగిరి రెడ్డి అనే ఎన్‌ఐని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసారు. సెప్టెంబర్ 3న జరిగిన యాదగిరి రెడ్డి శవయాత్ర రామనాధం క్లినిక్ ముందు నుండే వెళుతున్నది. ఆ ఊరేగింపులో ఎన్.పి., డిఐజి పోలీసులు ఉన్నతాధికారులతో పాటు చాలా మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ ఊరేగింపు జయప్రకాశ్ నారాయణ రోడ్డులోని రామనాధం క్లినిక్‌కు కొంతమంది పోలీసులు చొరబడి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో డా. రామనాధంను హత్య చేయడం జరిగింది.

రెండు గంటలలోపు శవాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం హైదరాబాద్ స్ధాయిలో కథ అల్లి కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రామనాధం హత్య చేసారనే ప్రచారం చేసారు. ప్రభుత్వంపై ప్రజల ఆరోపణకు ముందే ప్రభత్వమే తప్పుడు ప్రచారానికి సిద్ధమయ్యింది. 1983 85 సంవత్సరాల మధ్య కాలంలో నక్సలైట్ పోరాటాల పట్ల ముఖ్యమంత్రి ఉదాసీన భావం ఇక ముందు కనిపించవద్దని, వచ్చిన వత్తిడితో పోలీసుల అరాచక హింసలకు ప్రభుత్వం కూడా తోడ్పడి 1985 కాలం అది ఆట, పాట, మాట బంద్‌లతో తెలంగాణను ‘నిశ్శబ్దం’ చేయడానికి ప్రయత్నం తీవ్రతరం చేశారు. ఆ నిర్బంధ కాలంలో కొందరు నక్సలైటు ముఖ్య కార్యకర్తలను నిర్బంధించడం ద్వారా నక్సలైట్ ఉద్యమాన్ని బలహీన పరచలేమని భావించిన ప్రభుత్వం నక్సల్ ఉద్యమాన్ని బలపరిచే అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలన్నింటిని నిషేధించారు. సంస్థలను నిషేధించడంతో పాటు వ్యక్తులను అదృశ్యం చేసే స్థితికి చేరుకున్నది. ఒకవైపు లాకప్ హత్యలు, మరొకవైపు ఎన్‌కౌంటర్ హత్యలు మనుషుల్ని మాయం చేయడం లాంటి కొత్త నిర్బంధ రూపం ప్రారంభయింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు హక్కులతో జీవించాలని 36 ఏళ్ళ క్రితం హత్యకావించబడిన డా. రామనాధం చెప్పడమే కాదు, ఆచరించాడు కూడా.

అదే ఆచరణగా ‘అంకురం’ సినిమాగా నిర్మించబడి డా. రామనాధం కార్యాచరణను ప్రజలకు అందించింది. నిత్యం నిర్బంధంలో హక్కుల ఉద్యమాన్ని అక్కున చేర్చుకోవడమే కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఖచ్చితంగా హక్కులను అనుభవించాలి అనే ఉద్యమ స్ఫూర్తిని చూసిన ప్రభుత్వం ఒక పోలీసాఫీసర్ హత్యను అవకాశంగా తీసుకుని డా. రామనాధంను హత్య చేసింది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలే హత్య చేసిన అనేక మంది మేధావుల, హక్కుల కార్యకర్తల, జర్నలిస్టుల హంతకులు దొరకరు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీలో జరిగిన హక్కుల ఉల్లంఘనపై, దారుణ ఘటనలపై నివేదిక కోసం షా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాని తయారు చేసిన నివేదికలపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎన్‌కౌంటర్, హత్యలపై ఏర్పాటు కాబడ్డ భార్గవ కమిషన్‌కు కీలకమైన సాక్ష్యాల కోసం ప్రజలను తరలించడంలో డా. రామనాధం చాలా సహాయపడ్డాడు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కాబడ్డ చాలా మంది యువకులు చిత్ర హింసలతో చంపిన ఘటనలు సాక్షిగా ఉన్నాడు. ఎన్‌కౌంటర్ హత్యలకు, చిత్ర హింసలకు పరిశీలనకు ఏర్పాటు కాబడ్డ తార్కుండె కమిటీకి, భార్గవ కమిషన్ బాగా ఉపయోగపడ్డాడు.

ఎమర్జెన్సీ సమయంలో తెలంగాణల్లో ఉత్తర, పశ్చిమ జిల్లాకు ప్రధాన జైలుగా వుండే వరంగల్ కేంద్ర కారాగారాలకు తరలించి మూడు వారాల పాటు ఆ జైల్లో నిర్బంధించారు.అధికారం చేతిలో ఉన్నవాళ్ళు ప్రశ్నించే వాళ్ళను సహించరు. దాడి చేస్తారు, కొడతారు, అరెస్టు చేస్తారు, చంపుతారు. అది వాళ్ళ నైజం. కానీ ప్రశ్నించే హక్కునూ, విమర్శించే హక్కునూ కాపాడుకోకపోతే నష్టపోయేది కొద్ది మంది పౌర హక్కుల ఉద్యమకారులు మట్టుకేకాదు, ప్రజలంతా నష్టపోతారు. మన ప్రజాస్వామ్యం నష్టపోతుంది. దానిని ఇవాళ్ళ కాపాడుకోకపోతే రేపు రాబోయే కాలంలో మన జీవితాలను బాగు చేసుకోవడం అసాధ్యమైపోతుంది. ధరలు పెరుగుతాయి, నిరుద్యోగం పెరుగుతుంది, సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాలు పెరుగుతాయి. బలహీనుల మీద బలవంతులు దౌర్జన్యాలు పెరుగుతాయి. వీటిని ప్రతిఘటించాలంటే మనకు కనీస హక్కులు కావాలి. కనీస ప్రజాస్వామ్యం కావాలి. డా. రామనాధం హత్యకావించబడి 36 ఏళ్ళు అవుతున్నా ఎన్‌కౌంటర్ హత్యలు పెరగాయే కాని తగ్గలేదు. పోరాటాల ద్వారానే హక్కులను అమలు చేయించుకోగలం. హక్కులను అమలు చేసుకోగలిగినపుడే డా. రామనాధంకి మనం ఇచ్చే నివాళిగా భావించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News