న్యూఢిల్లీ: ఈ నెలలో జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ఒక దేశం, ఒకే ఎన్నికల అమలుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుతోపాటు కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు పచ్చజెండా ఊపాలనిఇదివరకే రాజకీయ నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 2010 అప్పటి యుపిఎ ప్రభుత్వం రాజ్యసభలో తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించి కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించే మహిళా రిజర్వేషన్ బిల్లు(108వ రాజ్యాంగ సవరణ బిల్లు)ను 2010 మార్చిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టగా తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య రాజ్యసభలో ఆమోదం పొందింది. అయితే సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్‌తోసహా అనేక రాజకీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించడంతో అప్పటి 15వ లోక్‌సభలో ఈ బిల్లు వీగిపోయింది. మహిళలకు కల్పించే 33 శాతం రిజర్వేషన్లలో ఓబిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు ఉప వర్గీకరణ చేయాలని ఎస్‌పి, ఆర్‌జెడితోసహా అనేక రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి.
ఇప్పుడు ఈ బిల్లును ఆమోదించడం ద్వారా మహిళా రిజర్వేషన్లపై ప్రతిపక్షాల మధ్య ఉన్న విభేదాలను బట్టబయలు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును కాంగ్రెస్ మొదటి నుంచి గట్టిగా సమర్థిస్తోంది. ఇప్పుడు ఈ బిల్లును కాంగ్రెస్ సమరించిన పక్షంలో తమ కూటమి భాగస్వాముల నుంచి తీవ్ర విమర్శలను ఆ పార్టీ ఎదుర్కోవలసి వస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతును తెలియచేస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే రెండు లేఖలు రాశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు మొట్టమొదటిసారి 1996లో 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఇదిలా ఉండగా ముఖ్యమైన అంశాలను చర్చించేందుకే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. త్వరలో ఎజెండాను పంపిణీ చేస్తామని, ఎజెండాను సభ్యులకు పంపిణీ చేయడానికి తగినతం వ్యవధి ఉందని ఆయన చెప్పారు. అయితే ఎజెండాలో ఉన్న అంశాల గురించి ఆయన వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అవి తుది దశ రూపకల్పనలో ఉన్నట్లు ఆయన చెప్పారు.