Friday, November 15, 2024

పాల రైతులకు బకాయిలు చెల్లించండి : బిజెపి

- Advertisement -
- Advertisement -

లీటర్ పాలకు ఆరు రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో పాల ఉత్పత్తి చేసే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కిసాన్ మోర్చా రాష్ట్ర బాధ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లీటరుకు రూ.4 ఇచ్చే ప్రోత్సాహకాన్ని కొన్ని నెలలుగా నిలుపుదల చేసిందన్నారు. ప్రోత్సాహకాన్ని ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. పాల ఉత్పత్తి చేసే రైతులకు దాదాపు రూ. 35 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది. వారికి వెంటనే బకాయిలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

పాల ఉత్పత్తికి అవుతున్న ఖర్చు, దాణా తదితర వాటికి ఎక్కువ అవుతున్నందున రైతులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి చేసే రైతులకు లీటర్‌కు ఆరు రూపాయల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని కోరారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పాల ఉత్పత్తి చేసే రైతులకు ఆరు రూపాయల ప్రోత్సాహకాన్ని ఇస్తుందన్నారు. రైతులకు పదివేల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇస్తామని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని, వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో శ్వేత విప్లవం కోసం అనేక ప్రోత్సాహకాలను, నిధులను ఇస్తూ ముందుకు సాగుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని రైతులకు అందించకుండా రైతులకు అన్యాయం చేస్తున్నది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన రానున్నదని ఆయన వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News