Friday, December 20, 2024

రామ్‌నాథ్ జమిలి జట్టు సిద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఏకకాల ఎన్నికలు (జమిలి)పై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఎనమండుగురు సభ్యులతో కమిటీని ప్రకటించింది. ఈ కీలక కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారధ్యం వహిస్తారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురి వంటివారు సభ్యులుగా ఉంటారు. దేశంలో రాజకీయ ప్రకంపనలకు జమిలి ప్రస్తావన దారితీసింది. ఈ నెల 18 నుంచి 22 వరకూ ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పిలుపు నిచ్చింది. ఈ సెషన్‌లోనే ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా జాప్యం లేకుండా సంబంధిత కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి శనివారం కేంద్రం నుంచి నోటిఫికేషన్ వెలువడింది. కాగా కమిటీలో డెమోక్రాటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి) అధ్యక్షులు గులాం నబీ ఆజాద్, 15వ ప్రణాళిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కె సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉంటారు.

జమిలీ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు , విధివిధానాల రూపకల్పనకు శుక్రవారమే కేంద్ర ప్రభుత్వం రామ్‌నాథ్ కోవింద్ నాయకత్వంలో కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కమిటీలోని పేర్లను వెల్లడించింది.అయితే జమిలి ఎన్నికల ప్రక్రియనే బిజెపి ప్రత్యేకించి మోడీ దురాలోచన అని, ఇప్పుడు ప్రకటించిన కమిటీలో విస్తృత స్థాయి ప్రాతినిధ్యం లేకపోవడం మరీ దారుణం అని విమర్శలు తలెత్తాయి. ప్రాంతీయ పార్టీలకు ఎటువంటి ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు ఇప్పటికైతే కనబడలేదని స్పందనలు వెలువడ్డాయి. దేశంలో సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి, ఒకే రోజు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్రం దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడైంది. లోక్‌సభ ఎన్నికలను ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారా? లేక అసెంబ్లీ ఎన్నికలనే నిర్ణీత సమయం ప్రకారం లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారా? లేక అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు కలిపి ఒకేసారి వచ్చే ఏడాదే జమిలిగా ఎన్నికలు నిర్వహిస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

కాగా కమిటీ సారధి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆది నుంచి జమిలికి అనుకూలంగా ఉన్నారు. ఆయన ఈ ప్రక్రియ నిర్వహణపై పలువురు నిపుణులు, రాజ్యాంగ విశ్లేషకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో వరుసగా చర్చిస్తారని వెల్లడైంది. దేశంలో 1967 వరకూ లోక్‌సభకు అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల ప్రక్రియ సాగింది. ఈ పద్దతికే తిరిగి వెళ్లడం , ఇందులో ఇమిడి ఉన్న ప్రక్రియలు, చేయాల్సిన తతంగం వంటి వాటిని విశ్లేషించుకునేందుకు కమిటీ ఏర్పాటు అయింది.

ప్యానెల్ ఏం చేస్తుంది?
ఇప్పుడు ఏర్పాటు అయ్యే జమిలి కమిటీ ఏం చేయాలి? ఏం చేస్తుంది? అనేది కీలకమైన విషయం. వివిధ సమస్యలకు కమిటీ పరిష్కారాలు సూచించాల్సి ఉంది. ఏ పార్టీకి ఎన్నికలలో నిర్థిష్ట మెజార్టీ రానప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి? అవిశ్వాస తీర్మానాలను ప్రజలు తీసుకువచ్చే వీలుందా? ప్రభుత్వాలపై ఇప్పుడు ప్రతిపక్షాలు అవిశ్వాసానికి వెళ్లుతున్నాయి. అయితే ప్రభుత్వంపై నమ్మకం సడలినప్పుడు ప్రజలు కూడా ఈ విధంగా చేసేందుకు వీలుందా? అనే విషయాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది. ఇక ఎన్నికల దశలో పార్టీల ఫిరాయింపులు, అధికారం కోసం పార్టీలలో చీలికలు, చేరికలు వంటి వాటిపై కూడా స్పందిస్తుందని తెలిసింది. సంబంధిత విషయాలపై ప్యానెల్ పరిశీలిస్తుంది. పలు సూచనలను, సవరణలను రాజ్యాంగంలో కల్పించేందుకు సిఫార్సు చేస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు, ఇతర చట్టాలు, రూల్స్‌ను విశ్లేషించుకుని జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరం అయిన సవరణలు ప్రతిపాదిస్తుందని వెల్లడైంది.

ఇంతకు ముందు కూడా జమిలీపై అధ్యయనాలు
ప్రజాప్రాతినిధ్య చట్టం మారితేనే సాధ్యమని వెల్లడి
దేశంలో జమిలి నిర్వహణపై గతంలో కూడా కమిటీలు ఏర్పడ్డాయి. సాధ్యాసాధ్యాలను పరిశీలించాయి. 1967 వరకూ ఏకకాల ఎన్నికల విధానం ఉంది. అయితే 1968, 69 లో కొన్ని అసెంబ్లీల రద్దు, 1970లో లోక్‌సభ రద్దు వంటి పరిణామాలతో వేర్వేరు ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. కాగా పాత పద్థతికి వెళ్లాలనే విషయంపై 1983లో ఎలక్షన్ కమిషన్ వార్షిక నివేదికలో వెలువడింది. దీనిపై తరువాత వరుసగా మూడు సార్లు వేర్వేరుగా పరిశీలన జరిగి, నివేదికలు వెలువడ్డాయి. 1999లో లా కమిషన్ నివేదిక వచ్చింది. అప్పట్లో మే నెలలో జస్టిస్ బిపి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ నివేదిక రూపొందించింది. ఇందులో ప్రతి ఏడాదికో ఎన్నికలు, సీజన్‌కో ఎలక్షన్ పద్ధతి మంచిది కాదు. ఇది ముగియాల్సి ఉంది. ఇంతకు ముందు లాగానే ఏక ఎన్నికకు వెళ్లాల్సి ఉందని తెలిపారు. ఐదేళ్లకోసారి లోక్‌సభకు , అసెంబ్లీలకు ఎన్నికలే చట్రం కావాలని జీవన్‌రెడ్డి నివేదిక తెలిపింది. అయితే తరచూ జరిగే పార్టీ ఫిరాయింపులు, ప్రభుత్వాల పతనాలతో ఏర్పడే శూన్యత విషయం ప్రస్తావనకు రాలేదు. 2015లో పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక వెలువడింది. ఈ ప్యానెల్‌కు డాక్టర్ ఇఎం సుదర్శన నాచియప్పన్ అధ్యక్షులుగా ఉన్నారు.

జమిలితో పలు రకాలుగా భారం తగ్గుతుందని తెలిపారు. తరువాత లా కమిషన్ ముసాయిదా ప్రతిపాదన 2018లో వచ్చింది. జస్టిస్ బిఎస్ చవాన్ సారధ్యపు లా కమిషన్ వెలువరించిన నివేదికలో కీలక విషయం ప్రస్తావించారు. దేశంలో ఇప్పుడున్న విధివిధానాల పరిధిలో ఏకకాల ఎన్నికలు కుదరవని తెలిపారు. పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కీలక మార్పులు చేయడం ద్వారా ఫిరాయింపులు అరికట్టి ఏకకాల ఎన్నికలకు మార్గం సుగమం చేయవచ్చు. అయితే ఈ క్రమంలో పలు చిక్కులు కూడా ఏర్పడవచ్చు. ఐదేళ్లకోసారి అధికారంలోకి వచ్చిన సర్కార్ల పాలనా ప్రక్రియ ఎటువంటిదైనా ప్రజలు ఇతర పార్టీలు భరించాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అయితే ఐదేళ్ల ఎన్నికల ప్రక్రియతో దేశంలో రాజకీయ వ్యవస్థలో ఇప్పటి హంగామా లేకుండా పోతుంది. ఇది మంచికా చెడుకా అనేది వేరే విషయం అని ఈ నివేదికలో తెలిపారు. పైగా కనీసం సగం రాష్ట్రాలు అయినా జమిలి ప్రతిపాదనకు అంగీకరించాల్సి ఉంది తెలిపారు. రాజ్యాంగ సవరణకు ఈ రాష్ట్రాలు తమ సమ్మతి తెలియచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News