Monday, December 23, 2024

తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుందాం : సిపిఐ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుందాం పేరిట సెప్టెంబర్ 11 నుండి 17 వరకు జరిగే వార్షికోత్సవాలను పురస్కరించుకుని భారీ కట్ అవుట్ ను హిమాయత్ నగర్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ఆనాటి పోరాట ఘట్టాలను, అమరవీరుల త్యాగాలను ప్రజల వద్దకు తీసుకుపోయి మరింత చైతన్యం చేయడానికి ప్రతి సంవత్సరం సిపిఐ పార్టీ కృషి చేస్తుందన్నారు.

ఆనాడు కరుడుగట్టిన భూస్వామ్య వర్గాల ప్రయోజనాలను కాపాడడం కోసం, తిరుగుబాటు చేస్తున్న ప్రజలపై నిరంతరం అణచివేత కొనసాగించడంలో భాగంగానే ‘రజాకారులు’ అనే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేశారని  అన్నారు. కానీ బిజెపి రజాకార్లు అంటే కేవలం ముస్లిం సైన్యం అనే తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ తెలంగాణ సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడానికి కొన్ని సంవత్సరాల నుంచి అనేక ప్రయత్నాలు కొనసాగిస్తోందన్నారు. అత్యంత చైతన్యమైన తెలంగాణ సమాజం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదనేది బిజెపి భావన అని, అయినప్పటికీ ఏవో కొన్ని సంఘటనల ఆధారంగా మొత్తం చరిత్రను చెరిపివేసి నిజాంపై కొనసాగించిన పోరాటాన్ని ఇది హిందూ ముస్లింలకు మధ్య జరిగిన పోరాటంగా చూపించడానికి బిజెపి  పాల్పడుతున్నదన్నారు.

నిజాం రాచరికానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరి విముక్తి కోసం దున్నేవాడికి భూమి కావాలని నినాదంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా పోరాటాలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. గ్రామాలలో దేశముఖ్ లు,  పటేళ్లు, పట్వారీలు ప్రజలపై తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగించి యదేచ్ఛగా తమ దోపిడిని కొనసాగించారు. హైదరాబాద్ కేంద్రంగా నిజాం పరిపాలన నడిచేది. సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి వీలు లేకుండా ‘గస్తి నిషాన్’ లాంటి చట్టాలు నిజాం అమలుపరిచాడు. కనీస పౌర హక్కు లు కూడా లేవు. తెలుగు భాషలో చదువుకోవడానికి పాఠశాలలు లేవు .కేవలం ఉర్దూ మీడియం లోనే పాఠశాలలు ఉన్నాయి. భాషా పరమైన వివక్ష ఉన్నది.మరోపక్క నిజాం పాలనకు సహకరిస్తూ గ్రామాలలో భూస్వామ్య పెత్తందారులు ప్రజలను పన్నుల రూపంలో పీల్చి పిప్పి చేశారు. మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించారు. అన్ని కులాల వారు వారి ఉత్పత్తులను ఉచితంగా దొరలకు ఇవ్వాలని ఒత్తిడి చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, సిపిఐ సీనియర్ నాయకులు ప్రేమ్ పావని, జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శి స్టాలిన్, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎం. నర్సింహా, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. వెంకటేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు నేర్లకాంటీ శ్రీకాంత్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి జెరిపోతుల కుమార్, ఏఐటియూసి నాయకులు కరుణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News