సర్దార్ జమలాపురం కేశవరావు నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. హైదరాబాదు రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించాడు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’గా పిలుచుకుంటారు.దక్కన్ సర్దార్‌గా, ఉక్కు మనిషిగా ప్రజలు పిలుచుకునే కేశవరావు నిజాం సంస్థానంలో తూర్పు భాగాన ఉన్న ఖమ్మం (నాటి వరంగల్ జిల్లా) లోని ఎర్రుపాలెంలో 1908, సెప్టెంబర్ 3 న జమలాపురం వెంకట రామారావు, వెంకట నరసమ్మలకు తొలి సంతానంగా జన్మించాడు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు అతనిని ఎంతగానో కలవరపరచాయి. ఎర్రుపాలెంలో ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాదులోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలోకి దిగాడు.
గీతాన్ని ఆలాపించనివ్వకపోతే తరగతులకు హాజరుకాబోమని హెచ్చరించాడు. దీంతో చివరకు నిజాం పాలక వర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. ఈ ఘటన తర్వాత కేశవరావు ఆలోచనా పరిధిని మరింత విస్తృతం చేసి ఆయన వెళ్లాల్సిన మార్గాన్ని మరింత స్పష్టం చేసింది. ఆరడుగుల ఆజానుబాహుడైన కేశవరావు, ఎత్తుకు తగ్గ దృఢమైన శరీరం, చెరగని చిరునవ్వుతో నిండు గా కనిపించేవాడు. నిజాం పాలనలో కొనసాగుతున్న వెట్టి చాకిరితో అష్టకష్టాలకు గురవుతున్న ప్రజలను చూసిన కేశవరావు చలించిపోయాడు. దాన్నుంచి ప్రజలను విముక్తం చేయడానికి తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కేశవరావు కాలినడకన విస్తృతంగా పర్యటించాడు. ఆ క్రమంలోనే భారత స్వాతంత్య్రోద్యమం పట్ల, గాంధీ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితుడయ్యాడు.1923లో రాజమండ్రిలో మొదటిసారి మహాత్మా గాంధీ ఉపన్యాసాన్ని విన్న కేశవరావు, 1930లో విజయవాడలో జరిగిన సభలో గాంధీ పరిచయంతో మరింత ఉత్తేజితుడైనాడు. ఆంధ్ర పితామహుడుగా మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గ్రంథాలయ ఉద్యమంను తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించాడు.
వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో కేశవరావు ముందుండేవాడు. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రత్యేక శ్రద్ధను కనపరిచేవాడు. ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్’ స్థాపనలో కేశవరావు కీలకపాత్ర వహించి, దానికి మొదటి అధ్యక్షుడయ్యాడు. 1938లో దీపావళి సందర్భంగా ఆవిర్భవించిన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్‌లో కేశవరావు పాత్ర నిర్వహించాడు. 1938 సెప్టెంబర్ 24 మధ్యాహ్నం మధిరలో గోవిందరావు నానక్, జనార్దనరావు దేశాయ్, రావి నారాయణరెడ్డిలతో కలిసి సత్యాగ్రహ దీక్షకు కేశవరావు సిద్ధమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో సర్దార్‌ను దీక్ష చేయనివ్వొద్దని నిజాం ప్రభుత్వం అనుమతినివ్వలేదు. మధిరలో అడుగడుగునా పోలీసులను మోహరించింది. అయినా భారీ సంఖ్యలో ప్రజలు దీక్ష వేదిక దగ్గరకు చేరుకున్నారు.
అప్పుడే ఎవరూ ఉహించని విధంగా రైతు వేషంలో దీక్ష వేదిక దగ్గరకు వచ్చాడు కేశవరావు.
వెంటనే మహాత్మా గాంధీకి జై, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ జై అని దిక్కులు పెక్కటిల్లేలా నినదించాడు. అరెస్టు చేసి నిషేధాన్ని ఉల్లఘించి సత్యాగ్రహ దీక్ష చేశారంటూ కేశవరావుకు 18 నెలలు జైలు శిక్ష విధించారు. వరంగల్ జైలులో ఎనిమిది నెలల శిక్షను అనుభవించిన తర్వాత కేశవరావుతో సహా రాజకీయ ఖైదీలందరినీ నిజామాబాద్ జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా అదే పోరాట పంథాను కేశవరావు కొనసాగించాడు. అంటరానితనం నిర్మూలించేందుకు ప్రయత్నం చేశాడు. ఆదివాసీల అభివృద్ధికి కూడా ఉద్యమం చేశాడు. పానుగంటి పిచ్చయ్య, వనం నరసింహారావు, నారాయణరావులతో పాల్వంచలో పర్యటించి ఆదివాసీ మహాసభను ఏర్పాటు చేశారు. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయాల స్థాపనను యజ్ఞంలా భావించాడు. అంతేకాక వయోజన విద్య కోసం రాత్రి బడులు నడిపాడు. అణగారిన వర్గాల్లో చైతన్యం నింపడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాడు.
1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ప్రచారం చేశాడు. 1946లో మెదక్ జిల్లా కందిలో కేశవరావు అధ్యక్షతన జరిగిన 13వ ఆంధ్ర మహాసభ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మాండమైన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహం మరువలేనిది. దానికి బాధ్యుడైన కేశవరావుకు ప్రభుత్వం రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది. యావత్ భారత దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో కేశవరావు వంటి నాయకులు నిర్బంధానికి గురికావడం ఒక విషాదం. నిజాం సంస్థానం భారత దేశంలో విలీనమైన తరువాత, 1952లో కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. జైలు జీవితం, ఉద్యమ సమయంలో భోజనం లేకపోవడం, పార్టీలోని నాయకులు చేసిన మోసంతో అనేక దుష్పరిణామాలు ఒక్కసారిగా సర్దార్‌పై దాడి చేశాయి. ఈ మానసిక ఒత్తిడిలోనే 1953, మార్చి 29న తన 46వ ఏట మరణించారు.