Saturday, December 21, 2024

దీప్తి మృతి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల ః కోరుట్లలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బంక దీప్తి అనుమానస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీప్తి హత్య కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ వెల్లడించారు. కోరుట్ల పట్టణానికి చెందిన బంక శ్రీనివాసరెడ్డికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి పెద్ద కూతురు దీప్తి బిటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందింది. కోరుట్లలోని ఇంటి నుంచే ఉద్యోగం చేస్తోంది. చిన్న కూతురు చందన కూడా బిటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. అయితే చందన బిటెక్‌లో తన క్లాస్‌మేట్ అయిన ఉమర్ షేక్ సుల్తాన్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని అతడితో ప్రేమలో పడింది. చందన అప్పుడప్పుడు తన ప్రియుడు షేక్ సుల్తాన్‌కు ఫోన్ చేసి కోరుట్లకు పిలిపించుకుని వారిద్దరూ కలుసుకునేవారు. ఈ క్రమంలో గత నెల 19న ఉమర్ షేక్ సుల్తాన్ కోరుట్లకు రాగా మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోరు… బయటకు పారిపోయి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తేగా ఉద్యోగం లేకుండా, చేతిలో డబ్బులు లేకుండా బయటకు వెళ్లి ఎలా జీవిస్తామని చందనకు సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు.

దాంతో ఉమర్ వాట్సాప్ కాల్ ద్వారా తన తల్లి సయ్యద్ అలియా మహబూబ్, చెల్లెలు ఫాతిమా, స్నేహితుడు హఫీజ్‌లతో చందనతో మాట్లాడించాడు. ఇది జరిగిన తర్వాత రెండు రోజులకు చందన ఉమర్‌కు ఫోన్ చేసి మా ఇంట్లో బంగారం, డబ్బులు బాగున్నాయని, వాటిని తీసుకెళ్లి మనం పెళ్లి చేసుకుందామని చెప్పింది. గత నెల 28న చందన ఉమర్‌కు ఫోన్ చేసి మా అమ్మనాన్న హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌కు వెళ్తున్నారని, అక్క దీప్తి, నేనే ఉంటామని, కోరుట్లకు వచ్చి తనను తీసుకెళ్లాలని చెప్పింది. దాంతో ఉమర్ తన కారులో గత నెల 28న ఉదయం బయలుదేరి 11 గంటల సమయంలో కోరుట్లకు చేరుకున్నాడు. ఈ లోపు అక్క దీప్తికి వోడ్కా తాగించి పడుకునేలా చేసింది. దీప్తి పడుకున్న తర్వాత ఉమర్‌ను ఇంటికి రమ్మని చందన మెసేజ్ చేయగా ఉమర్ ఇంటికి చేరుకున్నాడు. బీరువా తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు సర్దుతుండగా మెలకువ వచ్చిన దీప్తి తన చెల్లెలు చందన, మరో వ్యక్తిని చూసి ఏం చేస్తున్నావు అంటూ గట్టిగా అరిచింది. దాంతో వెంటనే దీప్తి అరవకుండా ఉండేందుకు ఆమె ముక్కు,

మూతికి స్కార్ప్‌ను గట్టిగా చుట్టి ప్లాస్టర్‌తో అతికించారు. కట్లను విప్పుకోకుండా చున్నీతో చేతులు కట్టేశారు. ఈ లోపు బంగారం, డబ్బులు సర్దుకుని దీప్తి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె కట్లను విప్పేసి మద్యం తాగడం వల్లే చనిపోయిందని నమ్మించేలా సీన్ క్రియేట్ చేసి ఇంటి నుంచి వారు పారిపోయారు. అయితే హైదరాబాద్ వెళ్లిన తల్లిదండ్రులు ఇంట్లోని తమ కూతుళ్లకు ఫోన్ చేస్తే వారిద్దరి ఫోన్‌ల నుంచి స్పందన రాకపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల వారికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని కోరగా ఇంటికి వెళ్లిన వారికి సోఫాలో విగతజీవిగా పడి ఉన్న దీప్తి కనిపించగా, చందన ఇంట్లో కనిపించలేదు. దాంతో విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులకు చేరవేయగా వారు హుటాహుటిన కోరుట్లకు చేరుకుని దీప్తి అనుమానస్పద మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మహారాష్ట్ర వైపు వెళ్తున్న చందన, ఉమర్ షేక్ సుల్తాన్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు ఎస్‌పి వివరించారు. దీప్తి హత్య కేసులో ఎ1 చందన,

ఎ2 చందన ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్, ఎ3 ఉమర్ షేక్ సుల్తాన్ తల్లి అలియా మహబూబ్, ఎ4 ఉమర్ చెల్లెలు షేక్ అసియా ఫాతిమా, ఎ5 ఉమర్ స్నేహితుడు హఫీజ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు బంగారు ఒడ్డాణాలు, పెద్ద బంగారు హారం, మూడు బంగారు గాజుల జతలు, బంగారు కంకణం, బంగారు చిన్న హారం, లక్ష రూపాయల నగదు, సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి తెలిపారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన మెట్‌పల్లి డిఎస్‌పి రవీందర్‌రెడ్డి, కోరుట్ల సిఐ ప్రవీణ్‌కుమార్, కోరుట్ల ఎస్‌ఐ కిరణ్, మేడిపల్లి ఎస్‌ఐ చిరంజీవి, కథలాపూర్ ఎస్‌ఐ పబ్బ కిరణ్‌కుమార్, కానిస్టేబుళ్లు విజయ్, పురుషోత్తం, శ్రీను నాయక్‌లను ఎస్‌పి అభినందించి రివార్డులను అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News