హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 30 రోజులు ప్రచారం చేసిన గెలవలేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. మాయమాటలను నమ్మె స్థితిలో ప్రజలు లేరని, వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఓడిపోతామనే జమిలీ ఎన్నికలను మోడీ ముందుకు తెచ్చారని దుయ్యబట్టారు.
జమిలీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, జమిలీ ఎన్నికలకు బిఆర్‌ఎస్ అనుకూలంగా ఉందని, జమిలీ ఎన్నికలకు సమ్మతి తెలుపుతూ 2018లో సిఎం కెసిఆర్ లేఖ రాసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బిఆర్‌ఎస్-బిజెపి ఒకే తాను ముక్కలు అని విమర్శించారు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని సూచించారు. రాష్ట్రాల హక్కులను హరించడానికే జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ కాదని, వన్ పార్టీ-వన్ పర్సన్ అనేది బిజెపి విధానమని చురకలంటించారు. జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం కలుగుతుందని, అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని, అధ్యక్ష తరహా ఎన్నికలు వస్తే దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోందని దుయ్యబట్టారు.
Also Read: లిఫ్టులో బిడ్డను ప్రసవించి..చెత్తకుండీలో పడేసి…