చందీగఢ్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జమిలి పాటపాడుతోందని, అయితే ఈ ఏకకాల ఎన్నికలతో దేశంలోని సామాన్యుడికి ఒరిగేదేమిటని ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి హర్యానాలో పార్టీ సభలలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. దేశంలోని సాధారణ పౌరుడు పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నాడని, వీటిని కాదని ఇప్పుడు ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ విధానానికి దిగడం వల్ల బాధిత ప్రజలకు ఏమైనా సముద్ధరించినట్లు అవుతుందా? కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆలోచన ఏమిటనేది తనకు ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు.
దేశ ప్రజలకు కావాల్సింది ఒన్ నేషన్ , ఒన్ ఎలక్షనా? లేక ఒన్ నేషన్ ఒన్ ఎడ్యుకేషనా? లేక ఒన్ నేషన్ ఒన్ ట్రీట్‌మెంటా? ఏది అని కేజ్రీవాల్ నిలదీశారు. అందరికి సమాన అవకాశాలు, విద్య రంగంలో ఛాన్సులు , పేద ధనికి తేడాల్లేకుండా సముచిత రీతిలో ఆదరించడం జరగాల్సి ఉందని తెలిపారు. ఇవి జరగాల్సినవి, వీటిని గాలికి లేదా పక్కకు పెట్టి ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టడం ఎందుకు? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. హర్యానాలో కూడా ఆప్ ద్వారా ప్రజలకు ఉచిత ప్రామాణిక విద్యను , ఫ్రీ కరెంటును కల్పిస్తుందని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.