బెంగళూరు : చంద్రయాన్ 3కు చెందిన కీలకమైన ప్రజ్ఞాన్ రోవర్ నిర్ధేశిత విధులను నిర్వర్తించిందని ఇస్రో వర్గాలు ఆదివారం ప్రకటించాయి. రోవర్ , ల్యాండర్‌ల నుంచి కీలకమైన సమాచారం, విశేష చిత్తరువులు ఇస్రో భూ కేంద్రానికి అందాయి. చంద్రుడిపై పగటి రోజులు పూర్తి కావడంతో ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ ఆదివారం నుంచి పూర్తిగా నిద్రావస్థలోకి జారుకుందని ప్రకటనలో తెలిపారు. చంద్రుడికి ఇది చీకటి దశ. తరువాతి పగటిదశ ఇక్కడ ఈ నెల 22 న ఆరంభం అవుతుంది. రోవర్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉంది. రోవర్‌కు చెందిన సౌర ఫలకం సూర్యకాంతి పడితే దీనిని రోవర్ గ్రహించడం ఆరంభిస్తే తిరిగి పనిచేయడం జరుగుతుంది. రోవర్‌కు సంబంధించిన రిసీవర్‌ను ఆన్ చేసే ఉంచారు.
నిర్ణీత తొలి దశలో రోవర్ అనుకున్న పనులు చేసింది. ఓ సారి ప్రమాదం నుంచి కూడా తప్పించుకుంది. ఫోటోలు తీసింది. శనివారం నుంచి స్లీప్‌మూడ్‌లోకి చేరిన రోవర్ ఇప్పుడు పూర్తిగా నిద్రలోకి జారుకున్నట్లే. అంతా అనుకూలించి ఈ నెలాఖరులో తిరిగి పనిచేయడం ఆరంభిస్తే తిరిగి డ్యూటీ స్టార్టయినట్లు , పగటికాంతి తిరిగి సోకినా పనిచేయకపోతే ఇక రోవర్ చంద్రుడిపై భారతదేశ శాశ్వత దూతగా విశ్వాంతర చరిత్రలో నిలుస్తుందని ఇస్రో భావోద్వేగపు ట్విట్టర్ ఎక్స్ సందేశంలో తెలిపింది. చంద్రుడిపై రోవర్ తొలి ఇన్నింగ్స్‌లో వంద మీటర్లు తిరిగి సెంచరీ సాధించింది. కాగా రెండో ఇన్నింగ్స్ కూడా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది.