ఉజ్జయిన్: రాష్ట్రంలో గత నెలలో వర్షాలు పడకపోవడంతో కరవు వంటి పరిస్థితి తలెత్తి విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, మంచి వర్షాలు పడాలని కోరుతూ ప్రజలు దేవుడిని ప్రార్థించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం ఉజ్జయిన్‌లోని మహాకాళేశ్వర్ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి నెలకొని ఉందని ఆయన అన్నారు. ఆగస్టు నెల మొత్తం వర్షలేమి ఏర్పడిందని, ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కరవు తరహా పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. పంటలకు ముప్పు ఏర్పడిందని, మంచి వర్షాలు పడి పంటలు కాపాడాలని మహాకాళేశ్వరుడిని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
మంచి వర్షాలు పడాలని కోరుతూ గ్రామాలు, పట్టణాలలో ఆయా స్థానిక సాంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భక్తి విశ్వాసాలతో బలంగా దేవుడిని ప్రార్థిస్తే సత్ఫలితాలు ఉంటాయని కూడా ఆయన చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతుందని ఆయన చెప్పారు.