- గ్రామీణ యువ రైతుకు దక్కిన గొప్ప అవకాశం
గజ్వేల్ జోన్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా నిర్వహిస్తున్న ప్రపంచ అతిపెద్ద టివి రియాలిటీ షో బిగ్ బాస్ షోలో చోటు సంపాదించాలని వివిధ రంగాలలో ఉన్న ప్రముఖులు ఎందరో ఆశపడుతుంటారు, అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ షోలో ప్రవేశం దొరకటం ఒక అదృష్టంగా భావిస్తుంటారు.
అలా ఒక్క అవకాశం వస్తే చాలు ఇక తమ జీవితం ధన్యమైపోతుందని, తమ భవిష్యతు బంగారు బాట అని భావిస్తుంటారు. అంతటి గొప్ప అవకాశం ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7లో తెలంగాణ జిల్లాలోని సిద్దిపేట జిల్లా సిఎం కెసిఆర్ ఇలాఖాలోని గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి దక్కింది. కొల్గూరు గ్రామానికి చెందిన గొడుగు పల్లవి ప్రశాంత్ అనే ఒక యువరైతు కామన్ మెన్ కోటాలో బిగ్ బాస్ షోలో చోటు ఖాయమవటం ఈ ప్రాంత వాసులను ఆశ్యర్యానికి ఆనందానికి గురిచేసింది.
ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో ప్రారంభం అయిన కొద్ది సేపటికే బుల్లితెరపై బియ్యం బస్తా మోసుకొస్తూ గొడుగు పల్లవి ప్రశాంత్ తళుక్కుమన్నాడు. ఈ సారి షోలో వివిధ రంగాలకు చెందిన కాంటెస్టెట్స్ ఉన్న వారిలో పక్కా లోకల్ పల్లెటూరి యువ రైతు మన ప్రశాంత్ ఒకరే ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు.