తెలంగాణకు క్యూకడుతున్న ఎడారి దేశ సంస్థలు
రూ.700 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు
ముందుకు వచ్చిన యుఎఇ దిగ్గజ సంస్థ నాఫ్ఫ్కో
రాష్ట్రంలో అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న సంస్థ
తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్‌తో కలిసి,
అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ
మన తెలంగాణ/హైదరాబాద్ : దుబాయిలో మంత్రి కెటిఆర్ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టబడితో మంత్రి కెటిఆర్ తన పర్యటన ప్రారంభించారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్ఫ్కో కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.700 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కెటిఆర్‌తో జరిగిన సమావేశంలో నాఫ్ఫ్కో సిఇవొ ఖాలిద్ అల్ ఖతిబ్ ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా రూ.700 కోట్లు రూపాయల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు వెల్లడించింది.
తెలంగాణతో పాటు భారతదేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం రానున్న భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని నాఫ్ఫ్కో తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ భారతదేశ డిమాండ్‌ను సరిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతోపాటు తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో కలిసి అంత ర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న మంత్రి కెటిఆర్ ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ద్వారా దాదాపు 100పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ సిఇవొ మంత్రి కెటిఆర్‌కి తెలిపారు. దాదాపుగా రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించిన కెటిఆర్ పలు మల్టినేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. భారీ పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. తిరిగి వస్తున్న సమయంలో దుబాయ్‌లో ఆగి రాష్ట్రం కోసం మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.