Monday, November 25, 2024

రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖకు కోట్లలో ఆదాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల నిరంతర కృషి వల్ల రాష్ట్రంలో నకిలీ మద్యం నియంత్రణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి తరలివస్తున్న అక్రమ మద్యాన్ని నివారించామని, తద్వారా నేడు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం కోట్లలో పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై ఎన్నో వేధింపులు ఉండేవన్నారు. తెలంగాణ వచ్చాక కల్లుగీత వృత్తికి పూర్వవైభవం తేవడమే కాకుండా, బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే గోదాముల ద్వారానే మద్యం కొనుగోళ్లు జరుపుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. నకిలీ మద్యాన్ని అమ్మే వారిపై కఠిన చర్యలు చేపడతామని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ యాజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో మాదిరిగా బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు వేదింపులు లేవని అన్నారు.

అక్రమ మద్యం అమ్మే వారిపై అవసరమైతే పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వారిని జైళ్లకు పంపిస్తామని హెచ్చరించారు. కల్లుగీత వృత్తిదారులకు ఇప్పటికే వృత్తి పరంగా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని, ఇటు బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు బార్లలో క్వార్టర్ , ఆఫ్ బాటిల్స్‌తో పాటు ఫుల్ బాటిల్స్‌లను కూడా విక్రయించుకునేలా అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు నడుపుకోవాలని, స్లాబ్ విధానం అమలు చేస్తున్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని సూచించారు.

గజమాలతో మంత్రికి సన్మానం..
తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల ఆత్మీయ సమావేశంలో బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి. దామోదర్ గౌడ్, గౌరవ సలహాదారులు బాలగోని బాలరాజ్ గౌడ్‌లు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వేధింపులు ఇప్పుడు లేవని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, అలాగే వి.శ్రీనివాస్ గౌడ్‌ల సహకారంతో అది కూడా ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకే బార్ అండ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. తమ వృత్తులకు నిర్వహించుకుంటూ ప్రభుత్వానికి ఆర్ధికంగా ఆదాయం సమకూరుస్తున్నామని, ఇందులో మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సహకారం కూడా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ల ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, చక్రపాణి, ఉపాధ్యక్షులు రామకృష్ణ, పి రాజు గౌడ్, మాజీ అధ్యక్షులు మనోహర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ కూరెళ్ళ వేములయ్య గౌడ్, అనిల్ కుమార్ గౌడ్, పవన్ కుమార్ గౌడ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి పది జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అసోసియేషన్ సభ్యులు బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News