హైదరాబాద్ ః రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు భారీగా వరద చేరుతోంది. దీంతో ఈరెండు ప్రాజెక్టుల నుంచి ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువ మూసీలోకి వదులుతున్నారు. జియాగూడ వద్ద మరింత వేగంగా ప్రవహిస్తోంది. దీంతో జియాగూడ-, పురానాపూల్ కలిపే 100 ఫీట్ల రహదారిపై రెండు అడుగుల మేర నీరు చేరడంతో పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేశారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి అటువైపు ప్రజలను ఎవరిని రాకుండా పోలీసు సిబ్బంది కాపాలా ఉన్నారు.
వరద ప్రవాహం మరింత పెరిగితే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా మూసీ వరద ఉద్ధృతి పెరగడంతో మూసారాంబాగ్ వంతెనపై ప్రవాహ తీవ్రతను బట్టి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. మూసీ పక్కన ఉన్న పురానాపుల్ శ్మశానవాటికలోకి భారీగా నీరు చేరింది. అంత్యక్రియలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూసీ పరివాహకంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.