న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేసియా పర్యటన అధికారిక ప్రకటనలో ఇండియా బదులు భారత్ పేరు పొందుపర్చారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియాలో ఈ నెల 7న జరిగే 20వ ఆసియాన్ ఇండియా సమ్మిట్, 18వ ఇఎఎస్ సమ్మిట్‌కు హాజరవుతున్నారని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే జి 20 సదస్సుకు వచ్చే నేతలకు విందు ఆహ్వాన పత్రాలలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ప్రకటన దేశం పేరు మార్పుపై తీవ్రస్థాయి
వివాదానికి దారితీయగా ఇప్పుడు దీనికి ప్రధాన మంత్రి పర్యటన ప్రకటన మరింతగా ప్రకంపనలకు దారితీసింది. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రధాని పర్యటన విశేష ప్రకటనను తన ట్విట్టర్ ద్వారా పొందుపర్చారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. వరుస క్రమంలో ఇండియా పేరును అనధికారికంగానే అధికారికంగా మార్చేస్తున్నారని పేర్కొంది. అయితే ప్రపంచ దేశాలన్నింటికి ఇండియా బదులు భారత్ పేరు మార్పు తెచ్చేలా చేసే శక్తి బిజెపికి ఉందా? అని ప్రశ్నించింది.