మనతెలంగాణ/ హైదరాబాద్ : హోంగార్డు రవీందర్ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో రవీందర్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడీ జరుగుతోందని.. ప్రతికూల పరిస్థితుల్లో వారు విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలన్నారు.
బందోబస్తు సమయాల్లో ప్రత్యేక అలవెన్స్‌లు ఇవ్వాలని కోరారు. హోంగార్డుల హక్కుల సాధన కోసం తాను ముందుంటా నని హామీ ఇచ్చారు. గతంలో శాసనసభలో తాను ప్రశ్నిస్తే.. హోంగార్డులకు ఉద్యోగ, ఆరోగ్య, సామాజిక భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అలా చెప్పి ఐదున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదన్నారు. రవీందర్ ప్రాణాలు కాపాడాలని అందుకు నేను కృషి చేస్తానని చెప్పారు. రవీందర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.