Monday, December 23, 2024

అయోమయంలో కోమటిరెడ్డి రాజకీయ భవిష్యత్ !

- Advertisement -
- Advertisement -

ఏఐసిసి రంగంలోకి దిగినా తగ్గని వెంకట్‌రెడ్డి
సిడబ్ల్యూసి సమావేశాల్లోపు బయటకు రావాలని అధిష్టానం సూచన
ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దల నుంచి కోమటిరెడ్డికి ఫోన్
అన్ని కమిటీల్లోనూ తనకు మొండి చేయి చూపారని
అనుచరుల ఆవేదన వ్యక్తం చేసిన వెంకట్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కీలక నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రస్తుతం అయోమయంలో పడింది. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలుగుతున్న నేత ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం భువనగిరి ఎంపిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సోదరుడు రాజగోపాల్ రెడ్డి తరహాలోనే ప్రస్తుతం గప్‌చుప్ అయ్యారు. గతంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేదాభిప్రాయాలు రావడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బిజెపి పార్టీలో చేరుతారన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఆయన సోదరుడు కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరడం, ఓడిపోవడం తర్వాత ఆపార్టీ కూడా పక్కన పెట్టడంతో రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి ఎంట్రీకి అధిష్టానం అడ్డు చెప్పడంతో పాటు వెంకట్‌రెడ్డికి సైతం పదవులు, బాధ్యతలు అప్పగించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మొండి చేయి చూపించింది. మునుగోడు ఉపఎన్నికల సమయంలో హైకమాండ్ ఆయన్ను స్టార్ క్యాంపెయిన్‌ర్‌గా నియమిస్తే దానికి న్యాయం చేయలేదన్న విమర్శలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఉన్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తరువాత తగ్గిన వెయిట్
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ పెద్దల దగ్గర వెయిట్ తగ్గింది. దీంతో ఆయనకు పార్టీకి చెందిన కమిటీల్లో చోటు కల్పించలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ అధిష్టానంపై అలిగారు. ఈ మధ్యన పలు కమిటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎందులో కూడా ఆయనకు స్థానం కల్పించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో వెంకట్‌రెడ్డికి చోటు కల్పించలేదు. అలాగే కేంద్ర ఎన్నికల కమిటీ (సిఈసీ)లోనూ ఆయన్ను చేర్చుకోలేదు. చివరకు రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో కూడా సభ్యుడిగా తీసుకోకపోవడంతో ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఇదే జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించడం ఆయన ఇంట్లో ఇద్దరికీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండడంతో ఇన్ని రోజులుగా తాను పార్టీకి సేవ చేస్తున్నా గుర్తించడం లేదని, కావాలనే కొందరు తనపై లేనిపోని అపవాదులు సృష్టించి తనకు ఎలాంటి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన తన అనుచరుల వద్ద వాపోయినట్టుగా సమాచారం. ఇదే విషయమై త్వరలో తాడోపేడో తేల్చుకుంటానని కూడా ఆయన అనుచరులతో పేర్కొన్నట్టుగా సమాచారం.
గతంలో బిజెపి అభ్యర్థిని బలపరచాలంటూ ఆడియో లీక్
ప్రస్తుతం ఎంపి కోమటిరెడ్డి అలగడంతో పాటు ఎవరితోనూ మాట్లాడకపోవడంతో ఈ విషయాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలిసింది. రానున్న రోజుల్లో ఆయన వ్యవహారశైలి ఇలాగే ఉంటే ఆయనకు టికెట్ విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని టిపిసిసి పేర్కొంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు హైదరాబాద్ వేదికగా జరుగునున్న నేపథ్యంలో ఆయన మౌనంతో ఆయనకు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో పిసిసి అధ్యక్షుడి పదవి కోసం ఆయన అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి హామీ రాకపోగా రేవంత్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో అప్పటి నుంచి ఆయన అంటీ ముట్టనట్లుగానే వ్యవహారిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి అభ్యర్థిని బలపర్చాలంటూ పార్టీ కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు ఆడియో క్లిప్ రూపంలో లీక్ కావడంతో ఆయన మరింత ఇరుకున పడ్డారు. ఆ కారణంగానే పార్టీలో కీలకమైన కమిటీల్లో ఆయనకు స్థానం దక్కలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
రంగంలోకి ఏఐసిసి
గాంధీభవన్‌లో ఆశావహుల దరఖాస్తుల ప్రక్రియ ముమ్మరంగా జరుగుతున్నా, స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనడానికి ఏఐసీసీ నేతలు వచ్చినా, వర్కింగ్ కమిటీ సమావేశాల నిర్వహణ నిమిత్తం పార్టీ ప్రధాన కార్యదర్శి వచ్చినా కలవకుండా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గైర్హాజరయ్యారు. స్వయంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రే ఆయన నివాసానికి వెళ్లి బుజ్జగింపు చర్యలు చేపట్టారు. అయినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో స్వయంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ రంగంలోకి దిగి ఫోన్ చేసి పిలిచారు. దానికి కొనసాగింపుగా గురువారం ఉదయం ఇద్దరూ కలిసి కారులోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు కలిసి వెళ్లారు. వర్కింగ్ కమిటీ సమావేశాలు, సోనియాగాంధీ పాల్గొనే బహిరంగసభల గురించి వివరించి పార్టీ లైన్ ప్రకారం తగిన చొరవ తీసుకోవాల్సిందేనని, దీనికి సహకరించాలని కూడా కోమటిరెడ్డికి వేణుగోపాల్ సూచించినట్టుగా తెలిసింది. సమస్యను అంతర్గతంగా, సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోమటిరెడ్డితో కెసి వేణుగోపాల్ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News