బీజింగ్: జి20 శిఖరాగ్ర సదస్సు సమీపిస్తున్న భారత్ పేరు మార్పు అంశం మన దేశంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై దేశంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మరో వైపు చైనా దీనిపై తన అక్కసు వెళ్లగక్కింది. అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకోవడానికి జి20 సదస్సును వేదికను అవకాశంగా మలుచుకోవాలని భారత్ కోరుకుంటోందని పేర్కొంది. పేరుకంటే ఇతర ముఖ్య విషయాలపై దృష్టి కేంద్రీకరించాలని చైనా ప్రభుత్వం అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ తాజా కథనంలో వెల్లడించింది.‘ స్వాతంత్య్రానికి ముందునుంచి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను భారత్ సంస్కరణల మార్గంలో నడిపించగలదా అన్నదే ముఖ్యమైన విషయం. విప్లవాత్మక సంస్కరణలు లేకుండా భారత్ విప్లవాత్మక అభివృద్ధిని సాధించలేదు. అయితే భారత్ పెరుగుతున్న అంతర్జాతీయ దృష్టిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి చోదక శక్తిగా మార్చుకోగలదని ఆశిస్తున్నాం.
ఇలాంటి సమయంలో జరుగుతున్న జి20 సదస్సులో ప్రపంచానికి ఢిల్లీ ఏం చెప్పాలనుకుంటోంది? కేవలం వలసవాదంగా భావిస్తున్న పేరును తొలగించే ప్రయత్నంగా కనిపిస్తోంది’ అని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.‘ ఆర్థిక సంస్కరణల విషయంలో 1991నుంచి చూస్తే ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఎంతో కీలకమని భావిస్తున్నప్పటికీ. దురదృష్టవశాత్తు భారత్ మాత్రం వాణిజ్య రక్షణవాదం వైపు వేగంగా అడుగులు వేస్తుండడం గమనార్హం. దేశం పేరు మార్చాలా? వద్దా? అనేదానికంటే ఇవన్నీ ఎంతో ముఖ్యమై అంశాలు’ అని చైనా మీడియా పేర్కొంది. ఇక ఇటీవల చైనా కంపెనీలపై భారత్ ఆంక్షలు విధించడాన్ని ప్రస్తావిస్తూ, భారత్ తన అసంతృప్తినిఅంతర్జాతీయ మార్కెట్లకు బహిరంగంగానే తెలియజేస్తోందని పేర్కొంది. జి20 సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఆర్థిక సంస్కరణలపై తన దృఢసంకల్పాన్ని తెలియజేసేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని చైనా సూచించింది.