Monday, December 23, 2024

బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని హుస్నాబాద్ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాదులోని ఎల్బీనగర్ సరూర్‌నగర్ స్టేడియం గ్రౌండ్ దగ్గర గల ప్రజా గాయకుడు గద్దర్ అన్న ప్రాంగణంలో నిర్వహించే బీసీల సింహగర్జన వాల్ పోస్టర్ ను శుక్రవారం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఆర్థికపరంగా బడ్జెట్ లో తెల్ల కాగితాల మీదనే బిసి సామాజిక వర్గాలకు అంకెల రూపంలో కాగితాలపై ఖర్చు చూపెడుతున్నారని బీసీల ఆర్థిక అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బీసీల కులవృత్తుల అభివృద్ధికి నిధులు విడుదల అయ్యేవని ప్రస్తుతం 5 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.

బిసి సమస్యలు పరిష్కారం కావాలంటే మన అభ్యర్థులు గెలవాలి అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఓటు మనదే సీటు మనదే ఇదే మా విధానం బీసీల విధానం అని అన్నారు. కులానికో సీటు బీసీలకే ఓటు మేమెంతో మాకంత అంటూ రాష్ట్రంలోని 119 సీట్లలో జనాభా దామాషా ప్రకారం 60 సీట్లతోపాటు, అసెంబ్లీ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు సీఎం సీటు బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు.

సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కాలని నిర్వహిస్తున్న బీసీల సింహ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు వడ్డేపల్లి మల్లేశం, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, కోహెడ కొమురయ్య, ఎలగందుల శంకర్, వేల్పుల రాజు, కరణ్ సింగ్, బోయిన సదన్, చింతల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News