Monday, December 23, 2024

ధిక్కార స్వరం కాళోజీ

- Advertisement -
- Advertisement -

అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి/ అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అంటూ ప్రజల గొడవను తన గొడవగా చెప్పినవాడు. పరుల కష్టం చూసి పగిలిపోవును గుండె /మాయ మర్మం చూసి మండిపోవును ఒళ్ళు అంటూ తన సున్నితపు మనసును ఆవిష్కరించిన మానవీయకవి, అన్నపు రాశులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట/ సంపదలన్నీ ఒక చోట గంపెడు బలగం ఒక చోట అంటూ సమ సమాజ నిర్మాణానికి కదం తొక్కిన ఉద్యమవీరుడు. కోటిన్నర మేటి ప్రజల గొంతొక్కటి గొడవ ఒక్కటి/తెలంగాణ నిలిచి గెలిచి ఫలించాలి భారతాన అని స్వప్నించిన ప్రజాకవి కాళోజీ.
పోరుగడ్డ ఓరుగల్లులో ఉద్భవించిన ఒక నిప్పుకణం దావానలం గా మారి యావత్ తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలను రేకెత్తించి వీర తెలంగాణ నుదుటన సింధూరమైన నిలిచింది.

ఆ నిప్పుకణం పేరు కాళోజీ. మనిషి జీవితంలో ఉద్యమం ఒక భాగం కావడం సహజం కానీ జీవితమే ఉద్యమంగా మారడం కేవలం కాళోజీలోనే చూసాం. నిజాం రాజ్యాన్ని ప్రతిఘటించడం దగ్గర నుండి నక్సలైట్లపై హింసను ఖండించే వరకు ఆయన అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆర్యసమాజ్ కార్యకలాపాలు, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహాసభ, భారత స్వాతంత్య్ర పోరాటం, హైదరాబాద్ విమోచన ఉద్యమం ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, పౌరహక్కులు, తెలంగాణ ఉద్యమం ఇలా ఈ గడ్డను తాకిన, శాసించిన ఏ ఉద్యమానికైనా కాళోజీ తన రెండు చేతులతో ఆహ్వానం పలికి ఆవాహన చేసుకున్నాడు. ఉద్యమకారుడుగానే మాత్రమే కాక కవిగా, కథకుడిగా ఉద్యమాలకు ఆలంబనయ్యాడు ఈ క్రమంలో మూడుసార్లు జైలు జీవితం అనుభవించాడు.కాళోజీకి అర్థం కా అంటే కాలంలో అంటే లోకం జీ అంటే జీవితం. కాలాన్ని, లోకాన్ని, జీవితాన్ని లెక్కచేయని ప్రజల మనిషి. కాళోజీ ఒక బక్క పలుచని మనిషి అయినా ఆయన శరీరంలో వజ్రతుల్యమైన ఒక దీక్ష ప్రచండ వాయువు లాంటి ఆవేశం దాగి ఉన్నాయి.

1914 సెప్టెంబర్ 9న ఇప్పటి కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రెట్టిహళ్లి గ్రామంలో ఆయన జన్మించాక కుటుంబం అక్కడ నుండి వరంగల్ జిల్లాలోని మడికొండకు వచ్చి స్థిరపడింది. తల్లికి ద్వితీయ పుత్రుడిగా తెలంగాణ తల్లికి అద్వితీయ పుత్రుడిగా పేరుగాంచాడు. తండ్రి నుండి మరాఠీ, తల్లి నుండి కన్నడం నేర్చుకున్నాడు. నిజాం ప్రాంతం కాబట్టి చదువుకున్నది ఉర్దూలో, కవిత్వం రాసింది తెలుగులో కానీ ఆరాటపడ్డది, పోరాడింది తెలంగాణ కోసం. ఆయనకు ప్రత్యేక ఆస్తి అంటూ ఏమీ లేదు. చిన్నప్పటి నుండి అన్న అయిన రామేశ్వరరావు ఆయన అవసరాలను తీర్చుకుంటూ వచ్చాడు. అప్పట్లో తెలంగాణ గడ్డపై సమాంతరంగా సాగిన పలు ఉద్యమాలకు కాళోజీ ఇల్లు కేంద్రంగా ఉండేది. ఈ ఉద్యమాలన్నీ సామాజిక జీవితంలోకి తెచ్చిన విలువలలోని మంచిని స్వీకరించడం వల్ల కావచ్చు కాళోజీకి తనదైన విశిష్ట వ్యక్తిత్వం అలబడింది. సమాజ సంఘర్షణలన వెంట నడిచిన వ్యక్తి కాబట్టే కాళోజీ మన హృదయాలలో సుస్థిర స్థానం స్థాపించుకున్నాడు. కవులు, విమర్శకులు చెప్పుకునే భాష, భావం, శిల్పం, ధ్వని, అలంకారాలు ఇలాంటివి పట్టించుకోకుండా తాను చెప్పదలుచుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పడమే కాళోజీ కవిత్వం. ఆయన ఎజెండా కేవలం ప్రజలు.

వాళ్లకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా అవతల వ్యక్తి ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత ఆత్మీయుడైన, ఎంత ధనవంతుడైన, చివరికి ఆ భగవంతుడే ఉన్నా కాళోజీ ఎదిరించి తీరుతాడు ఈ లక్షణాలే కాళోజీని ప్రజా కవి చేసింది ప్రజా కవి అనే బిరుదు కాళోజీలో ఒదిగిపోయింది. కాళోజీ బయటకు ఎంత గంభీరంగా ఉండేవారో లోపల అంత సున్నితమైన హృదయం ఆయనది. అతి చిన్న విషయాలకు కూడా తీవ్రంగా చలించిపోయేవారు. ఆయన మిత్రులు, ఉద్యమ నేతలు, కవులు, కళాకారులతోనే రోజంతా మాట్లాడుతుంటే ఉండేవారు.వాళ్ళు ఉన్నప్పుడు ఆయన ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించేవారు వారు లేనప్పుడు ఒక్కసారిగా మౌనిలా మారిపోయేవాడు. పుస్తకాలు చదువుకోవడం లేదంటే ఒక్కడే పేక ముక్కలు వేసుకుని ఆడేవాడు అన్నింటికీ మించి ఆయనకు క్రికెట్ అంటే ప్రాణం సచిన్ టెండూల్కర్ ఆయనకు విపరీతమైన అభిమానం. ప్రజాస్వామిక లక్షణాలన్నీ నిలువెల్లా వంట పట్టించుకున్న కవి. కనుక కాళోజీస్వరం ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం వల్ల సూటిగా తాగుతుంది. వర్తమాన వాస్తవాన్ని పురాణ ప్రతీకలతో హత్తుకునేలా చెప్పడం కాళోజీలా మరొకరికి సాధ్యంకాదు. ప్రజల హక్కుల కోసం తాపత్రయపడి వారి పోరాటాలకు జీవితాలకు వ్యక్తిత్వాలకు పెద్దదిక్కుగా నిలబడ్డారు. కాళోజీ లాంటి వ్యక్తులు అరుదుగా జన్మిస్తారు.

ఒక కన్ను అన్యాయాన్ని చూసి సహించలేక నిప్పులు కురిపిస్తుంది, ఇంకొక కన్ను ప్రజల సంవేదనలను జీర్ణించుకోలేక కన్నీరు కారుస్తుంది. ఈ రెండు పార్శాలు ఒకే వ్యక్తి లో ఉండటం బహు అరుదు. అటువంటి అరుదైన వ్యక్తి కాళోజీ. బడి పలుకుల భాష కాదు. పలుకుబడుల భాష కావాలని తెలంగాణ యాసలో కవిత్వాన్ని, కథలను రాసిన కవి. ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అయితే నేను వలకబోసిన పీపాల సిరా ఏ ఒక్క మెదడును కదిలించినట్లు లేదని కాళోజీ వాపోతాడు. రాసింది దాచుకోవడం చేతకానికవి. కవిత్వం తన్నుకోస్తుంటే దొరికిన సిగరెట్ పెట్టే చించి దాని వెనుక ఉన్న తెల్ల అట్ట మీద కవిత్వం రాసేవాడు అలా రాసి పోగొట్టుకున్న కవితలు అనేకం.

1992వ సంవత్సరంలో భారత దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పొందారు కాళోజీ నవంబర్ 13 2002వ సంవత్సరంలో వరంగల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన దేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అంకితం చేశాడు. కాళోజీ అంటే ఓ నిర్భీతికి ప్రతీక, ఓ ధిక్కార స్వరం, ఓ చెమ్మగిల్లిన కన్ను, ఓ ప్రవక్త, ఓ ప్రజాకవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ నిఖార్సయిన తెలంగాణ బిడ్డ. ఆయనను స్మరించుకోవడం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన వదిలిన వెళ్లిన విలువలని గౌరవించడం అంతకుమించి ఆచరించడం. అలా ఆచరించ గలిగినప్పుడే కాళోజీకి నిజమైన నివాళి సమర్పించినట్లు అవుతుంది. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేస్తాం అన్న ఆయన ఉద్యమ భావన ఇంకా మిగిలి ఉంది. ఈ మిగిలిన దాన్ని తెలంగాణ ప్రజలు ఆఖరి గొడవగా ఉద్యమించవలసింది ఇంకా ఉండనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను పరిరక్షించే బాధ్యత మనకు ఉందంటూ కాళోజీ ఎల్లప్పుడూ మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు.

ములుక సురేష్
944 132766

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News