Saturday, December 21, 2024

మొగ్గు ‘ఇండియా’ వైపే

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మామూలుగా అయితే చెప్పుకోదగినవేమీ కాదు. ప్రతిపక్షాలు దాదాపు అన్నీ ‘ఇండియా’ కూటమిగా జట్టుకట్టి ఎన్నికల్లో బిజెపి మీద ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకొన్న తర్వాత తొలిసారి జరిగినవి కావడం వల్ల వీటికి విశేష ప్రాధాన్యం కలిగింది. భారతీయ జనతా పార్టీ తన పాలనలోని త్రిపుర, ఉత్తరాఖండ్‌లలో మూడు శాసన సభా స్థానాలను గెలుచుకోగా, ప్రతిపక్షం నాలుగు సీట్లలో విజయం సాధించి ఆధిక్యతను నిరూపించుకొన్నది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి స్థానంలో ‘ఇండియా’ తరపున పోటీ చేసిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పొందిన విజయం అసాధారణమైనది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కే కాకుండా , బిజెపికి కూడా తీవ్ర పరాభవంగా దీనిని పరిగణించాలి.

ఘోసి నుంచి 2022లో సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసిన దారా సింగ్ చౌహాన్ గెలుపొందారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేసి తిరిగి బిజెపిలో చేరిపోడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. బిజెపి మళ్ళీ ఆయనకే ఆ స్థానాన్ని కేటాయించింది. సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసిన సుధాకర్ సింగ్ 40,000 ఓట్ల అతి పెద్ద మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఈ గెలుపు అభ్యర్థిది కాదని ‘ఇండియా’ కూటమిదేనని స్పష్టపడుతున్నది. ఇక్కడ 49.42% ఓట్లు మాత్రమే పోలైనప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ ఇంత మెజారిటీని పొందడం కమలనాథులకు మింగుడు పడని పరిణామమే. ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే సంవత్సరం మొదటి సగంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఘోసి ఫలితం ‘ఇండియా’ కూటమికి శుభ సూచకమే.

కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అది సాధించుకొన్న ఈ విజయం దాని భవిష్యత్తుకు మెరుగులు దిద్దుతున్నది. ప్రధాని మోడీ తన వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోడానికి, అంతర్జాతీయ రంగంలో దేశం దేదీప్యమానంగా వెలిగిపోతున్నదని చాటుకోడానికి జి20 వంటి సన్నివేశాలను ఘనంగా జరిపిస్తున్నప్పటికీ దేశ ప్రజలలో మాత్రం ఆయన గాని, ఆయన పార్టీ గాని పుంజుకోడం లేదని ఈ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ప్రజల అసలు సమస్యల పరిష్కారంలో వైఫల్యమే బిజెపికి ఈ దుస్థితిని సృష్టిస్తున్నది. ఈ ఎన్నికలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో జరిగాయి. కేరళలో పుత్తుప్పల్లి నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది.

ఆయన కుమారుడు చాందీ ఊమెన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి సిపిఐ(ఎం) అభ్యర్థి మీద గెలుపొందారు. ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్, సిపిఎం రెండూ ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములే కావడం విశేషం. పశ్చిమ బెంగాల్ ధూప్‌గురి స్థానం నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థిని 4,300 ఓట్ల ఆధిక్యతతో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారు. ఇక్కడ పోటీ చేసిన సిపిఎం అభ్యర్థికి ‘ఇండియా’ కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం గమనించవలసిన విషయం. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ‘ఇండియా’ కూటమి సభ్య పార్టీల మధ్యనే పోటీ సంభవించింది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇది ఇలాగే జరుగుతుందేమో చూడాలి. త్రిపురలో బిజెపికి చెందిన ప్రతిమా భౌమిక్ లోక్‌సభకు ఎన్నిక కావడం వల్ల అసెంబ్లీ నియోజక వర్గానికి రాజీనామా చేశారు. దానితో ధన్‌పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె సోదరుడు బిందు దేవ్‌నాథ్ బిజెపి తరపున పోటీ చేసి సిపిఐ(ఎం) అభ్యర్థి మీద విజయం సాధించారు. త్రిపురలోని బోక్సానగర్ ఉప ఎన్నికలో సిపిఐ(ఎం) బిజెపి చేతిలో ఓడిపోయింది.

అక్కడ గతంలో గెలుపొందిన సిపిఐ(ఎంకె) ఎంఎల్‌ఎ సంసుల్ హక్ చనిపోడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన బిజెపి ఎంఎల్‌ఎ చందన్ రామ్ దాస్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. పోటీ బిజెపి, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య సంభవించగా, బిజెపి తన స్థానాన్ని తిరిగి సాధించుకొన్నది. జార్ఖండ్‌లోని డుమ్రి స్థానం నుంచి ‘ఇండియా’ తరపున పోటీ చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి బేడీ దేవీ ఎన్‌డిఎ అభ్యర్థి యశోద దేవ్‌పై 17000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. త్రిపుర, ఉత్తరాఖండ్‌లు బిజెపి పాలనలోనే వున్నందున అక్కడ దాని అభ్యర్థుల గెలుపు ఊహించినదే. అయితే త్రిపురలో కమ్యూనిస్టులు ఇంకా పుంజుకోలేకపోడం స్పష్టంగా కనిపిస్తున్న లోపం. యుపిలోని ఘోసి స్థానంలో ‘ఇండియా’ కూటమి విజయం ప్రత్యేకించి చెప్పుకోదగినది. మొత్తం ఈ ఉప ఎన్నికల్లో ప్రజల మొగ్గును సూచిస్తున్న విజయమది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధ విధానాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి చెంది వున్నారని ఈ ఫలితం స్పష్టం చేస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News