జయంతి సందర్భంగా స్మరించుకున్న సిఎం కెసిఆర్
తెలంగాణ భాషకు అస్తిత్వ స్పృహను పెంచడంలో కాళోజీది కీలకపాత్ర
మన తెలంగాణ/హైదరాబాద్ : పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా, సిఎం కెసిఆర్ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ భాషకు అస్తిత్వ స్పృహను పెంచడంలో కాళోజీ ది కీలకపాత్ర అని సిఎం అన్నారు. సామాజిక సమస్యలను అన్యాయాలను తట్టుకోలేక ప్రజల కోసం ‘తన గొడవ’ను కవిత్వం ద్వారా సున్నితంగా ఆవిష్కరించిన కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉన్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజి పేరున ప్రతి యేటా పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను అందుకుంటున్న, ప్రముఖ కవి జయరాజుకు సిఎం కెసిఆర్ మరోసారి అభినందనలు తెలిపారు.