న్యూఢిల్లీ : జీ 20 లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. శనివారం భారత్ మండపంలో జరిగిన వన్ ఎర్త్ సెషన్ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆఫ్రికన్ యూనియన్ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేస్తూ… “మొరాకో భూకంప మృతులకు సంతాపం తెలియజేస్తున్నాను.
ప్రపంచం మొత్తం మొరాకోకు అండగా నిలవాలి. వారికి అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జీ 20 అధ్యక్ష హోదాలో భారత్ మీకు స్వాగతం పలుకుతోంది. ప్రస్తుతం 21 వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించ డానికి ఇదే కీలక సమయం. పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయి. అందుకనే మనం హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్‌తో ముందుకు అవసరం ఉంది. కొవిడ్ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడింది. యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచింది. కొవిడ్‌ను ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించవచ్చు. మనందరం కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలుదాము.
ఈ క్రమంలో సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ , సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ మంత్రం మనకు మార్గదర్శిగా ఉంటుంది. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు , ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్ల్లాల్సిందే. భారత్ జీ 20 అధ్యక్షతన దేశం లోపల , బయట అందరినీ కలుపుకొని పోవడానికి ప్రతీకగా నిలిచింది. ఇది ప్రజల జీ 20 అనడానికి నిదర్శనంగా మారింది. దేశం లోని 70 పైగా నగరాల్లో 200కు పైగా జీ 20 సదస్సులు జరిగాయి” అని తెలిపారు. “ సబ్‌కా సాథ్ భావనతోనే అఫ్రికన్ యూనియన్‌కు జీ 20 సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నాను. మీ అనుమతితో జీ 20 సభ్యుడి హోదాలో ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడు గ్రూపులో స్థానాన్ని స్వీకరించాలని ఆహ్వానిస్తున్నాను” అని మోడీ ప్రకటించారు.