పిఆర్ పెరిగిన ఉద్యోగావకాశాలు, పదోన్నతులు
ఖాళీ అయిన 740 ఏఈ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు త్వరలో భర్తీ
డివిజన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంగా తెలంగాణ వచ్చాకే ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో పంచాయితీరాజ్ శాఖను ప్రక్షాళన చేశామని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పంచాయితీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణలో భాగంగా శనివారం ఖైరతాబాద్, ఉప్పల్ లో ఏర్పాటు చేసిన పిఆర్ డివిజనల్ కార్యాలయాలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 87 కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేసి సిఈ, సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాలలో సంబంధిత అధికారులు బాధ్యతలు తీసుకున్నారన్నారు.
రాష్ట్రంలో మొత్తం 237 ఇంజనీరింగ్ కార్యాలయాలు ఉండగా మిషన్ భగీరథ తో పాటు ఇతర కార్యక్రమాల ద్వారా పంచాయతీరాజ్ కార్యకలాపాలు విస్తరించడంతో కొత్త కార్యాలయం ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కొత్తగా నాలుగు చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, 12 కొత్త సర్కిల్, 11 డివిజన్లు, 60 కొత్త సబ్ డివిజన్లు, 4 రోజుల్లో అందుబాటులోకి వచ్చాయని మంత్రి వెల్లడించారు. సిఈ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేసి, సర్కిల్ కార్యాలయాలు మంచిర్యాల, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వనపర్తి, సూర్యాపేట్, నిర్మల్, హైదరాబాద్, వరంగల్, మహబూబాబాద్ లలో అలాగే డివిజన్ కార్యాలయాలు గజ్వేల్, తాండూర్, ఇబ్రహీంపట్నం, హనుమకొండ, భూపాలపల్లి, దేవరకొండ, కోదాడ, కరీంనగర్, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఇప్పటికే కొత్త కార్యాలయాల కోసం కింది స్థాయి అధికారులకు పదోన్నతులు కల్పించాం అన్నారు. దీంతో ఏఈ స్థాయితో పాటు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 740 ఖాళీ అయ్యాయి అన్నారు. త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, చీఫ్ ఇంజనీర్ సంజీవ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.